పేటీఎం మాల్ తొలి మెగా సేల్
పేటీఎం మాల్ తొలి మెగా సేల్
Published Mon, Sep 18 2017 8:53 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
సాక్షి, న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు పోటీగా పేటీఎం మాల్ కూడా మెగా సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. 'మెరా క్యాష్ బ్యాక్' పేరుతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించే తేదీల్లోనే పేటీఎం మాల్ కూడా ఈ మెగా సేల్ ఈవెంట్‌కు తెరలేపబోతుంది. ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ ఈవెంట్ నిర్వహించనుంది. ఈవెంట్‌లో భాగంగా రూ.501 కోట్ల క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కంపెనీ అందించనున్నట్టు ప్రకటించింది. కొత్తగా 50 లక్షల మంది కొనుగోలుదారులను ఆకర్షించాలనే లక్ష్యంగా ఈ సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, ఫ్యాషన్ ప్రొడక్ట్‌లు, ఇతర ఉత్పత్తులపై 15 శాతం నుంచి 100 శాతం వరకు పేటీఎం మాల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. స్మార్ట్‌ఫోన్లపై రూ.15వేల వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు, పెద్ద పెద్ద అప్లియెన్స్ టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది.
25 మంది ఫోన్ కొనుగోలుదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ బహుమతిగా అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా నాలుగు రోజుల సేల్‌లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల పేటీఎం గోల్డ్‌ను కూడా ప్రకటించింది. పేటీఎం మాల్ నిర్వహిస్తున్న తొలి పండుగ సేల్ ఇదేనని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా తెలిపారు. తమ భాగస్వామ్య బ్రాండులు, మెర్చంట్లతో కలిసి క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించనున్నట్టు చెప్పారు. ఆపిల్, జేబీఎల్, ఉడ్‌ల్యాండ్, టైమెక్స్‌లు ఈ సేల్‌లో టాప్ బ్రాండులుగా ఉన్నాయి. తమ విక్రయాలను పెంచుకోవడానికి రిటైలర్లతో కూడా పేటీఎం మాల్ భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ కంపెనీ ఇటీవలే అలీబాబా, ఎస్‌ఏఐఎఫ్ పార్టనర్ల నుంచి ఫండ్స్ సేకరించింది.
Advertisement
Advertisement