న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ మార్కెట్లో దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ వాటాను పెంచుకునేందుకు 2018 సంవత్సరంలో భిన్న విధానాలను ఆచరణలో పెట్టనున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు సంస్థలు ఈ కామర్స్ మార్కెట్లో పై చేయి సాధించేందుకు గాను తీవ్ర స్థాయిలో పోటీ పడ్డాయి. అగ్ర స్థానం కోసం మార్కెటింగ్ వ్యూహాల పరంగా ఒకదాన్ని ఇంకొకటి అనుకరించేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ, కొత్త ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భిన్నంగా అడుగులు వేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. చైనా అలీబాబా వెన్నుదన్నుతో పేటీఎం మాల్ సైతం మూడో పక్షంగా అవతరించనుందని భావిస్తున్నారు.
చిన్న పట్టణాలపై ఫ్లిప్‌కార్ట్ గురి
ఈ కామర్స్ మార్కెట్‌లో అతిపెద్ద ప్లేయర్‌గా ఉన్న ఫ్లిప్‌కార్ట్ చిన్న పట్టణాల్లో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారించనుంది. తన సొంత బ్రాండ్ ఉత్పత్తులతో వినియోగదారులను చేరువ కావాలన్న వ్యూహంతో ఉంది. అమెజాన్ ప్రీమియం కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించనుంది. మొత్తం మీద ఇరు కంపెనీలు ప్రస్తుత తమ స్థానాలను పటిష్టంగా కాపాడుకుంటూనే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే విధానాలను అమలు చేయబోతున్నాయి. ‘‘మొదటి సారి ఈ కామర్స్ మార్కెట్ లీడర్లయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండు భిన్న మార్గాలను అనుసరించడాన్ని చూడబోతున్నాం’’అని హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) అనలిస్ట్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు. కేవలం సరుకుల అమ్మకాల విలువ (జీఎంవీ)పైనే ఈ మార్కెట్ ఎంతో కాలం కొనసాగకపోవచ్చని, ఆన్‌లైన్ కొనుగోలుదారులు, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు, కొత్త విభాగాలలో వృద్ధి ఉండొచ్చని ‘ఇండియా ఇంటర్నెట్: ఆన్ ద వే టు ఇండియా ఈ కామర్స్ 2.0’ పేరుతో విడుదల చేసిన నివేదికలో రాజీవ్ శర్మ వివరించారు. స్టోర్‌లో అన్ని ఉత్పత్తులు లభించేలా, కస్టమర్లు ఆశించేవన్నీ అందుబాటులో ఉండేలా చూడడమే తమ లక్ష్యమని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.
- మెట్రోలకు వెలుపల విస్తరించి ఉన్న పట్టణాల్లోని కస్టమర్లకు చేరువ కావాలన్నది ఫ్లిప్‌కార్ట్ యోచన. ప్రైవేటు లేబుల్స్ ఉత్పత్తుల ద్వారా వారిని చేరువ కావాలనుకుంటోంది.
- ఫ్లిప్‌కార్ట్ మొత్తం విక్రయాల్లో దాని సొంత లేబుల్స్ ఉన్న ఉత్పత్తుల విలువ 15 నుంచి 20 శాతం వరకు ఉంది.
- వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత అమ్మకాల్లో 45 శాతం చిన్న పట్టణాల నుంచే వస్తోంది.
- అమెజాన్ కూడా చిన్న పట్టణాల మార్కెట్‌ను సొంతం చేసుకునే ఆలోచనతో ఉంది.
- ప్రస్తుతం అమెజాన్ విక్రయాల్లో 65 శాతం వాటా మెట్రో నగరాల నుంచే ఉంది. ఇందులోనూ ‘అమెజాన్ ప్రైమ్’ పాత్ర కీలకం.
- అమెజాన్ ఇండియా ఫ్యాషన్, కిరాణా ఉత్పత్తులపైనా ప్రత్యేకమైన దృష్టి సారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment