‘ఇంజనీరింగ్‌’పై పెన్నార్‌ ఫోకస్‌! | Pennar Industries Limited Seeing Increased Volatility in Session | Sakshi
Sakshi News home page

‘ఇంజనీరింగ్‌’పై పెన్నార్‌ ఫోకస్‌!

Published Fri, Jul 27 2018 12:28 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Pennar Industries Limited  Seeing Increased Volatility in Session - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉక్కు ఉత్పత్తుల కంపెనీ ఇమేజ్‌ నుంచి బయటపడి పూర్తిస్థాయి ఇంజనీరింగ్, ఇంజనీరింగ్‌ సేవల కంపెనీగా ఎదుగుతున్న హైదరాబాదీ గ్రూపు పెన్నార్‌...  వాటిలో విస్తరణకూ సన్నద్ధమవుతోంది. సౌర విద్యుత్తుకు సంబంధించి ఇప్పటికే మాడ్యూల్‌ స్ట్రక్చర్ల తయారీలో ఉండగా... వీటికున్న డిమాండ్‌ దృష్ట్యా కొత్త ప్లాంటు దిశగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో లిస్టెడ్‌ కంపెనీలు పెన్నార్‌ ఇండస్ట్రీస్, పెబ్స్‌ పెన్నార్‌ ఉండగా... పెన్నార్‌ ఎన్విరో, పెన్నార్‌ రెన్యూవబుల్స్, పెన్నార్‌ గ్లోబల్‌ వంటి అన్‌లిస్టెడ్‌ సంస్థలూ ఉన్నాయి. పెబ్స్‌ పెన్నార్‌ – పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా ఏడాది కిందట అమెరికాలోని హూస్టన్‌లో  ఆరంభించిన ఇంజనీరింగ్‌ డిజైన్‌ సేవల సంస్థ పెన్నార్‌ గ్లోబల్‌ తొలి ఏడాదే రూ.36 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. ఇంజనీరింగ్‌ డిజైన్‌ సేవలు అందించటంతో పాటు తమకు హైడ్రాలిక్స్, ప్రెసిషన్‌ కాంపొనెంట్స్, స్టీల్‌ ట్యూబ్స్‌ తయారీ సామర్థ్యం కూడా ఉండటంతో ఇవన్నీ ఇంజనీరింగ్‌ విభాగంలో రాణించడానికి ఉపకరిస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది. తద్వారా కంపెనీ ఆదాయంలో స్టీల్‌ స్ట్రిప్స్‌ వాటా కన్నా ఇతర విభాగాల వాటా పెరిగేలా ఫోకస్‌ చేస్తున్నట్లు గ్రూపు వైస్‌ ఛైర్మన్, ఎండీ ఆదిత్య రావు ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో స్టీల్‌ స్ట్రిప్స్‌ వాటా 25 శాతానికన్నా తక్కువే ఉంది. అయితే మొత్తంగా స్టీలు ఉత్పత్తుల ఆదాయం 50 శాతం వరకూ ఉంది. దీన్లో హైడ్రాలిక్స్, ఆటో పరిశ్రమకు అవసరమైన ప్రెసిషన్‌ కాంపొనెంట్స్, స్టీల్‌ ట్యూబ్స్‌ వంటివీ ఉన్నాయి. ఎన్విరో విభాగానికి కొత్త క్లయింట్ల ద్వారా చెప్పుకోదగ్గ ఆర్డర్లు వస్తున్నట్లు కంపెనీ కమ్యూనికేషన్స్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న కె.ఎం.సునీల్‌ ‘సాక్షి’తో చెప్పారు.  

ఒకే కంపెనీ... ఒకే కార్యాలయం! 
గ్రూపు కార్యకలాపాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటం... ఇంజనీరింగ్‌ సేవల నుంచి ఉత్పత్తుల తయారీ వరకూ గ్రూపు కంపెనీలే చేపడుతుండటంతో విడిగా ఉన్న లిస్టెడ్‌ కంపెనీలు రెండింటినీ విలీనం చేయటానికి ఆయా బోర్డులు ఇదివరకే ఓకే చేశాయి. ఇంకా కొన్ని రెగ్యులరేటరీ అనుమతులు రావాల్సి ఉంది. దీంతో పాటు ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని శంషాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరో సిటీలోకి మార్చనున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 4 చోట్ల గ్రూపు కంపెనీలకు ప్లాంట్లు ఉండటంతో తయారీ కార్మికులతో పాటు పలువురు ఉద్యోగులూ అక్కడకు వెళ్లి పనిచేయాల్సి వస్తోంది. మొత్తం ఉద్యోగులందరినీ ఒకే చోటికి చేర్చే క్రమంలో భాగంగా ఏరో సిటీలో జీఎంఆర్‌ నుంచి ఒక టవర్‌ను కంపెనీ లీజుకు తీసుకుంది. అయితే కాంట్రాక్టు సంస్థ హోదాలో దాని నిర్మాణ బాధ్యతలనూ పెన్నారే చేపడుతోంది. 1.15 లక్షల చదరపుటడుగుల ఈ కార్యాలయంలోకి మారటానికి ఏడాది వ్యవధి పట్టొచ్చని, ఇది అందుబాటులోకి వచ్చాక సమన్వయం మరింత పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. 

క్యూ–1లోనూ ఆశించిన స్థాయి వృద్ధి! 
గతేడాది సంస్థ కన్సాలిడేటెడ్‌ ఆదాయం ఆదాయం రూ.1,550 కోట్ల నుంచి నుంచి 1784 కోట్లకు, నికరలాభం రూ.34.6 కోట్ల నుంచి రూ.70.4 కోట్లకు పెరిగాయి. ఎబిటా 26% పెరిగి రూ.162 కోట్ల నుంచి 221 కోట్లకు చేరగా.. ఎబిటా మార్జిన్లు సైతం 10.5% నుంచి 12.4%కి ఎగబాకాయి. కంపెనీ తొలి త్రైమా సికం ఫలితాలింకా వెలువడాల్సి ఉంది. ఇవి కూడా తమ అంచనాలకు తగ్గట్టే ఉంటాయని, కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న వృద్ధి రేటు ఈ త్రైమాసికంలోనూ అందుకుంటామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement