గ్లోబల్ తయారీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ప్రధాని హోదాలో మోడీ తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై కార్పొరేట్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. దేశీ తయారీ రంగాన్ని అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మోడీ ప్రణాళికను ప్రశంసించాయి. ఇండియాను అంతర్జాతీయ తయారీ, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దే బాటలో దేశ, విదేశీ ఇన్వెస్టర్లకు ప్రధాని మోడీ స్పష్టమైన సంకేతాలిచ్చారని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. మేక్ ఇండియా, మేడిన్ ఇండియా విజన్‌పై తమకు విశ్వాసం కలిగిందని పేర్కొన్నాయి.
ఇందుకు అవసరమైన విధానాలు రూపొందించడం, అభివృద్ధి చర్యలను చేపట్టడం ద్వారా దేశీ తయారీ రంగానికి ప్రస్తుత ప్రభుత్వం జోష్‌నిస్తుందని ఫిక్కీ అభిప్రాయపడింది. ‘రండి.. ఇండియాలో తయారు చేయండి’ అంటూ ఆహ్వానించడం ద్వారా అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు మోడీ అత్యంత సానుకూల సందేశాలను పంపారని అసోచామ్ పేర్కొంది.
యువతకు ప్రోత్సాహం: మెరుగైన పరిపాలన, నమ్మకం వంటి అంశాలు యువతకు ప్రోత్సాహాన్నిస్తాయని, వ్యాపార సంస్థలు కూడా భారీ లక్ష్యాలవైపు దృష్టిసారించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఫిక్కీ పేర్కొంది. దేశీ పరిశ్రమల సమాఖ్య సీఐఐ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. తయారీ రంగం, పెట్టుబడులకు ప్రధాని మోడీ అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారని ప్రశంసించింది.
జన ధన యోజన ఓకే.. స్వాగతించిన ఎస్‌బీఐ
ముంబై: నరేంద్ర మోడి జన ధన యోజనను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వాగతించింది. ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధనకు ఇది ఇతోధికంగా తోడ్పడగలదని ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. ఆర్థిక సమ్మిళిత వృద్ధిలో భాగంగా ఇప్పటివరకూ 59 శాతం కుటుంబాలకే బ్యాంక్ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో జన ధన యోజన ఉపయోగకరమైనదేనని వెల్లడించారు.
యూకే, ఆస్ట్రేలియా, జపాన్ తదితర ధనిక దేశాల్లో నగదు వినియోగం 2-6 శాతం మధ్యనే వుందని, డెబిట్ కార్డులతో కూడిన బ్యాం కు ఖాతాలు పెరిగితే మన దేశంలో కూడా నగదు వినియోగం బాగా తగ్గుతుందని ఆమె అన్నారు. ప్రధాని ప్రకటించిన తాజా స్కీము ద్వారా భవిష్యత్ బ్యాంకింగ్ వృద్ధికి సెల్యులర్ టెక్నాలజీని చక్కగా వినియోగించుకునే వీలు చిక్కుతుందన్నారు.
ఆర్థిక వృద్ధికి తోడ్పాటు: యూఎస్‌ఐబీసీ
వాషింగ్టన్: అందరికీ ఆర్థిక సేవలు అందించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ‘జన ధన యోజన’ పథకం .. మలి విడత సామాజిక, ఆర్థిక అభివృద్ధి దిశగా కీలకమైన అడుగని అమెరికా-భారత్ వ్యాపార మండలి (యూఎస్‌ఐబీసీ) అభివర్ణించింది. దేశ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమెరికన్ ఇన్వెస్టర్ల అభిమానాన్ని చూరగొంటున్నాయని యూఎస్‌ఐబీసీ తాత్కాలిక ప్రెసిడెంట్ డయాన్ ఫారెల్ పేర్కొన్నారు.
అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రయత్నాల్లో తమ వంతు సహకారాన్ని అందించేందుకు అమెరికన్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని ఆమె వివరించారు. బ్యాంకింగ్, బీమా, పింఛన్లు, అసెట్ మేనేజ్‌మెంట్ తదితర రంగాల సంస్థలతో కలిసి పనిచే యడాన్ని కొనసాగించాలని యూఎస్‌ఐబీసీ భావిస్తున్నట్లు ఆమె వివరించారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ విషయంలో భారత్ ముందు ప్రస్తుతం ఒక అద్భుతమైన అవకాశం ఉందని యూఎస్‌ఐబీసీ బోర్డు సభ్యుడు విజయ్ అద్వానీ అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న అత్యధిక భారతీయులకు ఆర్థిక సర్వీసులను అందుబాటులోకి తేవడం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం హర్షణీయమని చెప్పారు.