న్యూఢిల్లీ: భారత్లో అన్ని ప్రాజెక్టులపై పీఎంవో నిఘా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను అమెరికాలో పర్యటించిన తర్వాత భారత్లో పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో మోదీ ప్రసంగించారు. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు.
భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ అన్నారు. పెట్టుబడులు పెరగడం వల్ల భారత ఆర్థిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తమ హయాంలో ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి వచ్చిందని మోదీ అన్నారు. ఒబామా మాట్లాడుతూ అమెరికా, భారత్ వాణిజ్యంలో 60 శాతం వృద్ధి చెందిందని చెప్పారు. వాణిజ్యంలో ఆధునికతకు తాను, మోదీ ఆసక్తిగా ఉన్నామని చెప్పారు.