
సాక్షి, ముంబై: పీఎన్‌బీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితులు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ అధినేత మొహుల్ చోక్సీకి వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు వేగంగా కదులుతున్నాయి. ఇటీవల జారీ చేసిన సమన్లపై వీరిరువురు స్పందించకపోతే ..త్వరలోనే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మోదీకి చెందిన విదేశీ ఆస్తులపై ఇప్పటికే దృష్టిపెట్టిన ఈడీ దర్యాప్తును మరింత విస్తరిస్తోంది.
రూ. 11, 400 కోట్ల పీఎన్‌బీ స్కాంలో నీరవ్ మోదీ, అతని భార్య అమి, మెహల్ చోక్సిలను ముంబైలోని జోనల్ కార్యాలయంలో సోమవారం నాడు హాజరు కావలసి ఉంది. వారు హాజరు కాని పక్షంలో నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడానికి ప్రత్యేక పీఎంఎల్ కోర్టును ఈడీ సంప్రదించనుంది. డజనుకు పైగా దేశాలలో విదేశీ వ్యాపారాలు, ఆస్తులు ఈడీ పరిశీలనలోఉన్నాయి. దర్యాప్తులో భాగంగా బెల్జియం, హాంకాంగ్, స్విట్జర్లాండ్, అమెరికా, యూకే లాంటి దేశాలనుంచి అదనపు సమాచారాన్ని రాబట్టేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు న్యాయపరమైన అభ్యర్థనలను త్వరలో పంపనుంది.
మరోవైపు గత వారంలో వరుస దాడుల్లో మోదీ, ఆయన కంపెనీకి చెందిన విలువైన ఆస్తులు, సంపదతోపాటు లగ్జరీ కార్లను, గడియాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మోదీకి చెందిన ముంబై వడాలలోని ఇంటిలో ప్రఖ్యాత ఆర్టిస్టులకు చెందిన 150 పెయింటింగ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె వి బ్రహ్మజీరావును సీబీఐ రెండో రోజుకూడా విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment