మెప్పించిన మారుతీ.. | Post launch Maruti Suzuki S-Cross may prove to be strong ... | Sakshi
Sakshi News home page

మెప్పించిన మారుతీ..

Published Fri, Aug 1 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

మెప్పించిన మారుతీ..

మెప్పించిన మారుతీ..

క్యూ1లో రూ.762 కోట్ల నికర లాభం; 21% అప్
ఆదాయం రూ.11,074 కోట్లు;11 శాతం వృద్ధి
అమ్మకాల్లో 12.6% పెరుగుదల..
త్వరలో మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్, ఎల్‌సీవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ...
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2014-15)లో రూ.762 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.632 కోట్లతో పోలిస్తే లాభం 21% ఎగబాకింది. అమ్మకాలు పుంజుకోవడం, వ్యయ నియంత్రణ, ఫారెక్స్ రాబడులు ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం 11% వృద్ధితో రూ.9,995 కోట్ల నుంచి రూ.11,074 కోట్లకు పెరిగింది.
 
అమ్మకాల జోరు...
‘సన్నగిల్లిన వినియోగదారుల విశ్వాసం, అధిక ద్రవ్యోల్బణం ఇతరత్రా పలు ప్రతికూలాంశాలతో గతేడాది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అయితే, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం కొలువుదీరడంతో వినియోగదారుల్లో విశ్వాసం మళ్లీ పుంజుకుటోంది. తొలిసారి కారు కొనుగోలు చేసేవాళ్లు పెరిగారు. దీంతో కంపెనీ టాప్ సెల్లింగ్ మోడల్ అయిన ఆల్టో అమ్మకాలు క్యూ1లో 30 వేల మార్కును అధిగమించాయి’ అని మారుతీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) అజయ్ సేథ్ పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో కంపెనీ మొత్తం 2,99,894 వాహనాలను విక్రయించింది.

క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.6 శాతం వృద్ధి నమోదైంది. దేశీయంగా 2,70,643 వాహనాలు(10.3% వృద్ధి) అమ్ముడవగా... 29,251 వాహనాలను(38.7% వృద్ధి) ఎగుమతి చేసింది.  క్యూ1లో మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు రూ.689 కోట్లను రాయల్టీ రూపంలో చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, ప్రస్తుత 2014-15 ఏడాదిలో రూ.4,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అజయ్ సేథ్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు గురువారం బీఎస్‌ఈలో ధర 1.07 శాతం నష్టంతో రూ.2,525 వద్ద స్థిరపడింది.
 
కొత్త కార్ల క్యూ...: దేశీ మార్కెట్లో తమ వాటాను మరింత పటిష్టం చేసుకునేందుకు మారుతీ కొత్త కార్ల విడుదలకు సమాయత్తమవుతోంది. వచ్చే 12 నెలల్లో మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్, ఎల్‌సీవీ(లైట్ కమర్షియల్ వెహికల్), కాంపాక్ట్ ఎస్‌యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)తో తదితర వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు మారుతీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ భారతి వెల్లడించారు. ఇప్పుడున్న మోడళ్లను మరింత మెరుగుపరచనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement