వాషింగ్టన్: భారీ టారిఫ్‌లతో వాణిజ్యపరంగా తమ దేశాన్ని భారత్ చాన్నాళ్లుగా గట్టిగా దెబ్బతీస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. భారత మార్కెట్లో అమెరికా ఉత్పత్తుల విక్రయాలకు మరింతగా అవకాశాలు కల్పించేలా ప్రధాని నరేంద్ర మోదీతో వ్యాపారాంశాలు చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కొలరాడోలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24, 25న ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను వచ్చే వారం భారత్ సందర్శిస్తున్నాను. అక్కడ వాణిజ్యం గురించి చర్చలు జరుపుతాను. వ్యాపారపరంగా అనేకానేక సంవత్సరాలుగా భారత్ మనను దెబ్బతీస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో అది కూడా ఒకటి. వీటన్నింటిపై కాస్త మాట్లాడాలి‘ అని ట్రంప్ చెప్పారు. ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్యంలో భారత్ వాటా సుమారు 3%గా ఉంటుంది.
అమెరికాకు ప్రయోజనకరమైతేనే డీల్..
భారత పర్యటన సందర్భంగా భారీ డీల్ కుదరవచ్చన్న అంచనాలు తగ్గించే ప్రయత్నం చేశారు ట్రంప్. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత్‌తో ఏదైనా భారీ డీల్ కుదుర్చుకోవచ్చని, అప్పటిదాకా చర్చల ప్రక్రియ నెమ్మదిగా సాగవచ్చని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ప్రయోజనకరంగా ఉంటేనే ఏ ఒప్పందమైనా కుదుర్చుకుంటామన్నారు.
ఆతిథ్యంపై భారీ అంచనాలు..
భారత్‌లో స్వాగత సత్కారాలు భారీ స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంకు వెళ్లే దారిలో దాదాపు కోటి మంది దాకా స్వాగతం పలుకుతారని ప్రధాని మోదీ నాకు చెప్పారు. అయితే, దీంతో ఓ చిన్న సమస్య రావొచ్చు. ఇప్పుడు సమావేశమైన ఈ ప్రాంగణం సుమారు 60వేల మందితో కిక్కిరిసిపోయింది. వేల మంది లోపలికి రాలేక బైటే ఉండిపోయారు. అయినప్పటికీ.. భారత్‌లో కోటి మంది ప్రజల స్వాగతం చూశాక.. ఇక్కడ వేల సంఖ్యలో వచ్చే వారు కంటికి ఆనకపోవచ్చు‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారీ టారిఫ్‌లతో దెబ్బతీస్తోంది
Published Sat, Feb 22 2020 6:01 AM | Last Updated on Sat, Feb 22 2020 6:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment