ప్రధాని జన ధన యోజన(పీఎంజేడీవై) పథకం అద్భుత విజయంతో ఆర్థిక శాఖ ఇప్పుడు దీన్ని 100 శాతం సాకారం చేసేందుకు నడుంబిగించింది.
ప్రధాని జన ధన యోజన(పీఎంజేడీవై) పథకం అద్భుత విజయంతో ఆర్థిక శాఖ ఇప్పుడు దీన్ని 100 శాతం సాకారం చేసేందుకు నడుంబిగించింది. బ్యాంకు అకౌంట్ లేకుండా ఒక్కరు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో ’ఓపెన్ చాలెంజ్ మోడ్’ను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఎవరైనా సరే తమకు బ్యాంక్ ఖాతా లేదని చెబితే.. తక్షణం బ్యాంకులు అకౌంట్ తెరిచే ఏర్పాట్లు చేస్తాయని అధియా వెల్లడించారు. ఇప్పటిదాకా ఖాతాల్లేని వారిలో 98 శాతం మందికి పీఎంజేడీవై కింద ఈ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. మిగతావారికీ ఈ నెల 26 కల్లా ఖాతాలు తెరిపించేందుకే... ఈ ‘ఓపెన్ చాలెంజ్ మోడ్’ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
అందరికీ బ్యాంకింగ్ సేవలు(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), సబ్సిడీల కల్పన కోసం ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) స్కీమ్‌లపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారిస్తోందని.. బ్యాంకర్లు, బీమా సంస్థలకు ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. కాగా, పీఎంజేడీవై కింద ఇప్పటివరకూ 10.3 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినట్లు అధియా వివరించారు. జనవరి 26 కల్లా 10 కోట్ల ఖాతాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించగా.. ఇప్పటికే దీన్ని అధిగమించడం విశేషం. కాగా, డిసెంబర్ 22 నాటికి బ్యాంకులు 7.28 కోట్ల రూపే కార్డులు జారీచేశాయి.