ఐటీ జాబ్‌లు కష్టమే!! | Q1 results: Infosys outshines TCS on growth front | Sakshi
Sakshi News home page

ఐటీ జాబ్‌లు కష్టమే!!

Published Tue, Jul 18 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

ఐటీ జాబ్‌లు కష్టమే!!

ఐటీ జాబ్‌లు కష్టమే!!

కొత్త కొలువులకు ఆటోమేషన్, కొత్త టెక్నాలజీల సెగ...
క్యూ–1లో దిగ్గజాల నియామకాల్లో తిరోగమనం...
టీసీఎస్, ఇన్ఫీల్లో చేరినవారికన్నా మానేసినవారే ఎక్కువ
టీసీఎస్‌లో 1,414 మంది, ఇన్ఫీలో 1,811 మంది తగ్గుదల...
కోతలు లేవంటూనే.. జోరు తగ్గించామంటున్న కంపెనీలు
మానేసిన వారిలో... తీసేసిన వారూ ఉండొచ్చన్న నిపుణులు  


ఉద్యోగాల కల్పవృక్షంగా చెప్పుకునే ఐటీ పరిశ్రమ.. ఇప్పుడు కొత్త కొలువుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ప్రధానంగా ఆటోమేషన్‌కు తోడు డిజిటల్, క్లౌడ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) దిశగా అడుగులేస్తున్న ఐటీ కంపెనీలు.. ‘జాబ్‌లెస్‌’ వృద్ధిపై దృష్టిపెడుతున్నాయి. ఉన్న ఉద్యోగులను తొలగించడం లేదని చెబుతూనే... కొత్త నియామకాల్లో వేగం తగ్గించామని ఒప్పుకుంటున్నాయి. ఉద్యోగుల ఉత్పాదక సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచడం ద్వారా, అంటే ఉన్న సిబ్బంది నుంచే సాధ్యమైనంత మేర పనిని పిండుకొని లాభదాయకతను నిలబెట్టుకోవాలనేది వాటి వ్యూహం. ఫలితంగా దేశీ ఐటీ రంగంలో కొత్త కొలువులు కనాకష్టంగా మారే పరిస్థితి నెలకొంది. అమెరికా సహా కొన్ని దేశాల రక్షణాత్మక చర్యలు, వీసా నిబంధనల కఠినతరం వంటివి కూడా ఐటీ రంగానికి పెను సవాళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కూడా.

తాజా ఫలితాల్లో తేటతెల్లం...
దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఇటీవలే ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2017–18, ఏప్రిల్‌–జూన్, క్యూ–1) ఫలితాల్లో ఉద్యోగాలు తగ్గుతున్న ధోరణి స్పష్టమైంది. టీసీఎస్‌ క్యూ1లో స్థూలంగా 11,202 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 12,616 మంది కంపెనీని వీడిపోయారు. దీంతో నికరంగా 1,414 ఉద్యోగాలు తగ్గిపోయాయి. మార్చి చివరి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,87,223 కాగా, జూన్‌ చివరినాటికి మొత్తం సిబ్బంది 3,85,809కి పడిపోయింది. గడిచిన మూడు నెలల్లో ఉద్యోగులెవరినీ తొలగించలేదని టీసీఎస్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ అజోయ్‌ ముఖర్జీ ఫలితాల సందర్భంగా చెప్పారు. అయితే, ఈ ఏడాది కొత్త ఉద్యోగాల కల్పన కాస్త తక్కువగా ఉండొచ్చని ఆయన స్పష్టం చేయడం నియామకాల్లో మందగమనానికి నిదర్శనం. మరోపక్క, ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌) క్యూ1లో 12 శాతానికి ఎగబాకింది.

ఇన్ఫోసిస్‌ విషయానికొస్తే... ఈ ఏడాది ఏప్రిల్‌– జూన్‌ కాలానికి నికరంగా 1,811 ఉద్యోగాలు తగ్గాయి. దీంతో జూన్‌ చివరి నాటికి ఇన్ఫీ మొత్తం సిబ్బంది (అనుబంధ సంస్థలతో కలిపి) సంఖ్య 1,98,553కు చేరింది. జూన్‌ క్వార్టర్‌లో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌) 21 శాతానికి ఎగబాకింది. మార్చి క్వార్టర్‌లో ఇది 17.1 శాతం మాత్రమే. హైరింగ్‌ను కొనసాగిస్తున్నామని, అయితే, నియామకాల్లో వృద్ధి తగ్గుముఖం పట్టినట్లు ఫలితాల ప్రకటన సందర్భంగా ఇన్ఫోసిస్‌ చీఫ్‌ విశాల్‌ సిక్కా కూడా చెప్పారు. ఉద్యోగుల వలసల రేటు భారీగా పెరగడం, నికర నియామకాలు తగ్గడాన్ని చూస్తుంటే... నైపుణ్యాలు, పనితీరు సరిగ్గా లేవంటూ కొంతమంది సిబ్బందికి పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న వాదనలు కూడా బలపడుతున్నాయి. ఇలా పొగబెట్టి పంపించేసిన వారిని వెళ్లిపోయిన వారిగా చూపించటం వల్లే అట్రిషన్‌ రేటు అంత ఎక్కువ ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

మారుతున్న క్లయింట్ల ధోరణి...
ప్రస్తుతం దేశం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల విలువ 117 బిలియన్‌ డాలర్లు. ఇందులో దాదాపు ఐదో వంతు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లదే. అయితే, ఇప్పటివరకూ దేశీ ఐటీ కంపెనీలకు భారీగా వ్యాపారాన్ని ఇస్తున్న బ్యాంకింగ్, రిటైల్, ఇంధన రంగం వంటి సంప్రదాయ సర్వీసుల నుంచి ఆదాయంలో మందగమనం ఐటీ కంపెనీలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఎందుకంటే మన ఐటీ సంస్థలు సంపాదిస్తున్న ప్రతి 5 డాలర్లలో 4 డాలర్లు ఈ రంగాలకు చెందిన సేవల నుంచే లభిస్తున్నాయి. మరోపక్క, ఆటోమేషన్‌ కారణంగా కిందిస్థాయి ఉద్యోగుల అవసరం అంతకంతకూ తగ్గుతూవస్తోంది. ఐటీ సంస్థల ప్రధాన క్లయింట్లు కూడా డిజిటల్, క్లౌడ్‌ వంటి టెక్నాలజీలవైపు తమ వ్యయాలను మళ్లిస్తుండటం కూడా ఆ దిశగా మన ఐటీ కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి.

డిజిటల్‌ నైపుణ్యాల్లో 2.15 లక్షల మందికిపైగా ఉద్యోగులకు శిక్షణనిచ్చినట్లు తాజాగా టీసీఎస్‌ వెల్లడించింది. ఇదిలాఉండగా, ఐటీ కంపెనీ లకు ప్రధాన ఆదాయ వనరైన అమెరికా వంటి దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణితో(అధ్యక్షుడిగా ట్రంప్‌ వచ్చాక ఈ వైఖరి మరింత పెరిగిపోయింది) మన కంపెనీలు అమెరికన్లను ఎక్కువ జీతాలిచ్చి తప్పకుండా నియమించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు అమెరికన్లకు భారీగా కొలువులను కూడా ప్రకటించాయి. ఈ ప్రభావంతో కంపెనీల వ్యయం పెరిగి... దేశీయంగా కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు వెనకాడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

మార్జిన్లు కాపాడుకోవడానికే...
కొత్త టెక్నాలజీలకు మారుతున్న తరుణంలో కొత్తవారికి అవకాశాలు సన్నగిల్లుతాయన్నది తాజాగా కంపెనీల వాదన. ‘అంతర్గతంగా టాలెంట్‌ పూల్‌ (నిపుణులను తయారు చేసుకోవడం) ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే మా కంపెనీ స్థాయి దృష్ట్యా డిజిటల్, క్లౌడ్‌ వంటి కొత్త సేవల్లో అనుభవం ఉన్నవారిని పూర్తిగా బయటినుంచి తీసుకోవడం కష్టం. కొందరిని నియమించుకుంటాం కానీ, ఎక్కువగా ప్రస్తుత ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపయోగించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం.’ అని టీసీఎస్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ అజోయ్‌ ముఖర్జీ పేర్కొన్నారు.

సిబ్బంది ఉత్పాదకత(యుటిలైజేషన్‌) ఇటీవలి కాలంలో 2 శాతం పెరిగిందని.. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ ఎగబాకడం(ఏప్రిల్‌–జూన్‌లో 3.5 శాతం పెరిగింది. 64.5 వద్ద కదలాడుతోంది) దీని ఫలితాన్ని దెబ్బతీసినట్లు ఇన్ఫీ మాజీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన మోహన్‌ దాస్‌ పాయ్‌ చెబుతున్నారు. అంతేకాకుండా ఐటీపై ప్రపంచవ్యాప్తంగా కంపెనీల వ్యయాలు తగ్గడంతో మన ఐటీ సంస్థల మార్జిన్లకు ఎసరుపెడుతోందని చెప్పారు. ఇన్ఫోసిస్‌ నిర్వహణ మార్జిన్‌ క్యూ1లో అరశాతం తగ్గి 24.1 శాతానికి పరిమితమైంది. ఇక టీసీఎస్‌ మార్జిన్లు అయితే, 2.3 శాతం దిగజారి.. 23.4 శాతానికి పడిపోయాయి. ఈ తరుణంలో మార్జిన్లు పడిపోకుండా చూసుకోవడానికి కొత్త నియామకాలను చాలా కంపెనీలు వాయిదా వేసుకుంటున్నాయని ఆయన అంటున్నారు.

నాస్కామ్‌ అంచనాల్లోనూ...
ఈ ఏడాది(2017–18)లో భారత్‌ ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాలను నాస్కామ్‌ తగ్గించడం మందగమనానికి అద్దం పడుతోంది. వరుసగా రెండో ఏడాదీ వృద్ధి సింగిల్‌ డిజిట్‌కే (7–8%) పరిమితం చేసింది. గతేడాది ఎగుమతులు 8.3% పెరిగాయి. ఇక దేశీయంగా పరిశ్రమ ఆదాయం 8.6% వృద్ధితో 38 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో మొత్తం ఐటీ పరిశ్రమ ఆదాయం 155 బిలియన్‌ డాలర్లుగా లెక్కతేలింది. భారత్‌ స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ)లో ఇది 7.7%. ఇదిలాఉండగా, ఈ ఏడాది దేశీ ఐటీ కంపెనీలు 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తాయనేది నాస్కామ్‌ తాజా అంచనా. దీంతో మొత్తం కొలువుల సంఖ్య 38.5 లక్షలకు చేరొచ్చని భావిస్తోం ది. గతేడాది(2016–17) 1.73 లక్షలు, అంతక్రితం ఏడాది(2015–16) 2 లక్షల కొత్త ఉద్యోగాలతో పోలిస్తే హైరింగ్‌ జోరు తగ్గుతున్న దాఖలాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement