హైదరాబాద్లో రాంబోల్
♦ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం
♦ 2018 నాటికి రూ.250 కోట్ల వ్యాపారం లక్ష్యం
♦ రాంబోల్ గ్రూప్ ఈడీ సోరెన్ జాన్సెన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెన్మార్క్ కేంద్రంగా ఇంజనీరింగ్, డిజైన్, కన్సల్టెన్సీ సేవలందిస్తున్న రాంబోల్... హైదరాబాద్‌లో తొలి ఇంజనీరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇండియా, ఇతర మార్కెట్లకు టెలికాం రంగంలో సేవలందించేందుకు ఈ సెంటర్‌ను వినియోగిస్తామని రాంబోల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెట్స్ అండ్ గ్లోబల్ ప్రాక్టీసెస్) సోరెన్ జాన్సెన్ చెప్పారు. రాంబోల్ ఇండియా ఎండీ పవన్ మైనీ, టెలికాం డెరైక్టర్ పంకజ్ సచ్‌దేవ్‌లతో కలిసి బుధవారమిక్కడ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోరెన్ మాట్లాడుతూ... 230 మంది సుశిక్షితులైన నిపుణులు పనిచేసే ఈ సెంటర్‌లో టెలికం టవర్ల సాంకేతికత, ఇంజనీరింగ్, డిజైనింగ్, నిర్మాణం, అమ్మకాలు, రివర్స్ ఇంజనీరింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ వంటి వాటిల్లో సేవలందిస్తామని తెలియజేశారు.
టెలికంతో పాటూ ఈ సెంటర్ నుంచి రవాణా, పట్టణ ప్రణాళిక వంటి వాటి డిజైనింగ్, రూపకల్పనలోనూ సేవలందిస్తామన్నారు. ‘‘మా మొత్తం వ్యాపారంలో ఇండియా వాటా 1.5 శాతం. దీన్ని రెండంకెల వృద్ధికి తీసుకెళ్లటమే మా లక్ష్యం. ఇందుకోసం టెక్నాలజీ కోసం, నిపుణుల నియామకంలోనూ భారీ పెట్టుబడులు పెడుతున్నాం. 2015లో ఇండియా ద్వారా రూ.160 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. 2018 నాటికి దీన్ని రూ.250 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని సోరెన్ వివరించారు. రైలు, అర్బన్ డిజైన్, ప్లానింగ్, బిల్డింగ్ స్ట్రక్చర్ వంటి విభాగాల్లో ఇతర కంపెనీల కొనుగోళ్ల వంటి వాటిపై దృష్టి పెట్టామని చెప్పారు. మరో నాలుగైదు నెలల్లో ఈ కొనుగోళ్లు జరుపుతామన్నారు.
డెన్మార్క్ కేంద్రంగా 1945లో ప్రారంభమైన రాంబోల్... 1.4 బిలియన్ యూరోల టర్నోవర్‌ను సాధిస్తోంది. 35 దేశాల్లో 300 కార్యాలయాలతో సేవలందిస్తున్న ఈ సంస్థకు దేశంలో గుర్గావ్, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో కార్యాలయాలున్నాయి. ఇక్కడ సుమారు 800 మంది ఉద్యోగులున్నారు. ‘‘ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నగరంలో ఏర్పాటు చేస్తున్న గిడ్డంగి స్ట్రక్చర్‌ను మేమే డిజైన్ చేశాం. హైదరాబాద్ మెట్రో రైల్ రైడర్‌షిప్ సర్వే నిర్వహించింది కూడా మా సంస్థే’’ అని పవన్ తెలియజేశారు.