ఆర్‌బీఐకి ‘ధర’ల సెగ!
♦ రెపో రేటు యథాతథం
♦ ధరల పెరుగుదల భయాలే కారణం
♦ అయితే రివర్స్ రెపో పెంపు
♦ బ్యాంకింగ్‌లో అధిక నిల్వల నేపథ్యం
♦ ఎంఎస్‌ఎఫ్ తగ్గింపు
♦ పాలసీ కమిటీ ఏకాభిప్రాయ నిర్ణయాలు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఫిబ్రవరి 7 నాటి తన సంకేతాలకు అనుగుణంగానే తాజా పాలసీ నిర్ణయం తీసుకుంది. 2017–18 సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ తన మొట్టమొదటి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష వివరాలను గురువారం వెల్లడించింది. రేటు నిర్ణయానికి సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకాభిప్రాయ ప్రాతిపదికన సమీక్ష నిర్ణయాలు జరిగినట్లు వివరించింది. దీనిప్రకారం బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను యథాతథంగా 6.25%గా కొనసాగించాలని నిర్ణయించింది.
ఇప్పటికే బ్యాంకుల వద్ద అధిక నిల్వల (లిక్విడిటీ) పరిస్థితి నెలకొనడం, పదేళ్ల బాండ్ ఈల్డ్ భారీ పెరుగుదల దీనితో ద్రవ్యోల్బణం భయాలు, వృద్ధి బాటలో ప్రభుత్వ వ్యయాల వంటి అంశాలు దీనికి నేపథ్యం. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ రెపో రేటును పావుశాతం చొప్పున రెండుసార్లు మొత్తంగా అరశాతం తగ్గించింది. ఫిబ్రవరి 7 నాటికి పాలసీ సమీక్ష సందర్భంగా రేటు తగ్గించకపోగా, తన పాలసీ విధానాన్ని ‘అవసరమైతే రేట్లు తగ్గించే నిర్ణయం’ నుంచి ‘తటస్థం’కు మార్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2015 జనవరి నుంచీ రెపో రేటు 1.75% తగ్గింది.
రివర్స్ రెపో– ఎంఎస్‌ఎఫ్ అప్ అండ్ డౌన్...
మరోవైపు బ్యాంకులు తమ అదనపు నగదు నిల్వలను డిపాజిట్ చేసినప్పుడు తాను చెల్లించే రేటు– రివర్స్ రెపోను ఆర్‌బీఐ పావుశాతం పెంచి 6 శాతానికి చేర్చింది. దీనితో రెపో–రివర్స్ రెపో మధ్య వ్యత్యాసం పావు శాతానికి తగ్గినట్లయ్యింది. ఇది మనీ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులను తగ్గించడానికి దోహదపడుతుంది. డీమోనిటైజేషన్ నేపథ్యం లో బ్యాంకుల వద్ద అధిక నగదు నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం– తమ అదనపు నిల్వలను ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేసి, బ్యాంకులు కొంత మొత్తాన్ని సంపాదించుకునే వీలూ ఏర్పడింది. ఇక అదే సమయంలో వ్యవస్థలో అత్యవసర సమయాల్లో నగదు సర్దుబాటులో భాగంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్)ను ఆర్‌బీఐ పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి తగ్గింది. ప్రభుత్వ సెక్యూరిటీలపై బ్యాంకులకుఆర్‌బీఐ స్వల్పకాలిక (ఓవర్‌నైట్) రుణ సౌలభ్యతను కల్పించడానికి ఉద్దేశించిందే ఈ ఇన్ర్çస్టుమెంట్.
పాలసీ ముఖ్యాంశాలు...
⇔ స్థూల విలువ జోడింపు ఆధారిత (జీవీఏ) ఆర్థికాభివృద్ధి గత ఆర్థిక సంవత్సరం 6.7 శాతం. అయితే 2017–18లో ఇది 7.4 శాతానికి పెరిగే వీలుంది.
⇔ రుతు పవనాల పరిస్థితిపై అనిశ్చితి ఉంది.
⇔ ఈ ఆర్థిక సంవత్సరం సగటున మొదటి అర్ధభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా, అటు తర్వాత సగం నెలల్లో 5 శాతంగా ఉండవచ్చని అంచనా.
⇔ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), జూలై–ఆగస్టుల్లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం అంచనా, పే కమిషన్ అవార్డు, ఆర్‌బీఐ నుంచి లభించిన రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు మరింతగా బదలాయించే వెసులుబాటు వంటి అంశాలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం కావచ్చు. దీనితోపాటు ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గడం వల్ల దేశీయంగా పెట్రోలియం ధరలు కూడా తగ్గితే ఇది టోకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుంది.
⇔ ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) వంటి స్థూల ఆర్థికాంశాల విషయంలో మెరుగుదల కనిపిస్తోంది.
⇔ ఆహారధాన్యాల రికార్డు నిల్వలు, సేకరణతో ఆహార ధరలపై ఒత్తిడి తగ్గొచ్చు.
⇔ జనవరి 4తో పోల్చితే మార్చి నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు లిక్విడిటీ తగ్గుతూ వస్తోంది. డీమోనిటైజేషన్ నుంచి రీమోనిటైజేషన్ ప్రక్రియ వేగవంతమైన అమలు దీనికి కారణం.
మౌలిక రంగానికి ఊపు
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌ఈఐటీ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుల్లో(ఐఎన్‌వీఐటీ)పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులను ఆర్‌బీఐ అనుమతించింది. నగదు లభ్యతతో సతమతమవుతున్న మౌలిక రంగం ఊపునకు దోహదపడే అంశం ఇదని నిపుణులు భావిస్తున్నారు. తాజా అనుమతుల వల్ల బ్యాంకులు తమ నెట్ ఓన్డ్ ఫండ్ (ఎన్‌ఓఎఫ్)లో 20 శాతం వరకూ ఈక్విటీ– ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీఎఫ్), ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే వీలుంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించి మేనెల ముగింపునాటికితగినమార్గదర్శకాలువెలువడతాయనిఆర్‌బీఐతెలిపింది.
ఎండీఆర్ చార్జీలపై త్వరలో తుది మార్గదర్శకాలు
ముంబై: డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు సంబంధించి మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)లపై త్వరలో తుది మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. ఎండీఆర్‌కు గతంలోని నిబంధనలే ఇప్పుడు కొనసాగుతాయని ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ పాలసీ వెల్లడి సందర్భంగా పటేల్ ఈ వివరాలు వెల్లడించారు. కాగా ‘డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ హేతుబద్ధీకరణ’ పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఒక ముసాయిదా సర్క్యులర్‌ను ఆర్‌బీఐ జారీ చేసింది.
బ్యాంక్‌లు, వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ స్థాయిలో ప్రతిస్పందన వచ్చిందని, ఈ సూచనలు, ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పటేల్ పేర్కొన్నారు. ఎండీఆర్ చార్జీలు ప్రస్తుతం రూ.1,000 వరకూ చెల్లింపులకు 0.25%గా, రూ.1,000–2,000 వరకూ 0.5–0.7% వరకూ, రూ.2,000కు మించిన చెల్లింపులకు 1%గా ఉన్నాయి. వినియోగదారులు ఎలాంటి సర్వీస్ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదనే నినాదాన్ని వ్యాపారులు డిస్‌ప్లే చేయాలని కూడా ఈ సర్క్యులర్ పేర్కొంది.
రుణాల రద్దు.. చెల్లింపు సంస్కృతికి దెబ్బ: ఉర్జిత్
రుణ రద్దు పథకాలు నైతిక నిబద్ధతకు ప్రమాదమని ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. నిజాయితీగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలన్న సంస్కృతిని ఇలాంటి పథకాలు దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.36,000 కోట్ల వ్యవసాయ రుణాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో పటేల్ చేసిన వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ఇలాంటి ప్రకటనలు తగవని స్పష్టంచేసిన ఆయన ఈ తరహా ప్రకటనలు చేయకుండా చూసేలా ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని 2017–18 పాలసీ సమీక్ష అనంతరం చేసిన ప్రకటనలో పటేల్ పేర్కొన్నారు.
ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ రుణ భారాలు పెరిగే అవకాశం ఉంటుందనీ, ద్రవ్య సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనీ ఆయన అన్నారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఈ తరహా ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల రద్దు విషయంలో ఆర్‌బీఐ గత గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ద్రవ్య లభ్యత, నిర్వహణ అంశాలపై ఆర్‌బీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందని కూడా ఆర్‌బీఐ గవర్నర్ తాజా పాలసీ సమీక్ష సందర్భంగా స్పష్టం చేశారు.
ఆర్థికాభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు: బ్యాంకర్లు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు ద్రవ్యోల్బణం కట్టడికి, ఒత్తిడిలో ఉన్న ఆస్తులనిర్వహణకు దోహదపడతాయని బ్యాంకర్లు పేర్కొన్నారు. మొత్తంగా ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, వెరసి ఆర్థికాభివృద్ధికి ఈ చొరవలు వీలు కల్పిస్తాయని పలువురుబ్యాంకర్లు అభిప్రాయపడ్డారు.
ఫైనాన్షియల్ వ్యవస్థకు ఊతం
ఆర్‌బీఐ నిర్ణయాలు అన్నీ ఊహించిన విధంగానే ఉన్నాయి. అభివృద్ధి, రెగ్యులేటరీ విధానాల కోణంలో ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంది. ఇవన్నీ దీర్ఘకాలంలో ఫైనాన్షియల్ వ్యవస్థ మెరుగుకు దోహదపడతాయి. ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ దృష్టి... భారత్ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసానికి, క్యాపిటల్ ఫ్లోస్‌కు మద్దతు కొనసాగడానికి దోహదం చేస్తుంది.
– అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్
ఆర్థికాభివృద్ధికి దోహదం
ఆర్‌బీఐ ద్రవ్యోల్బణంపై ప్రధానంగా దృష్టి సారించింది. దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధికి ఊతం ఇచ్చే అంశం ఇది. రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రాలో పెట్టుబడులకు బ్యాంకులకు వెసులు బాటు కల్పించడం, దేశీయ ఫైనాన్షియల్ మార్కెట్ మరింత విస్తృతం కావడానికి దోహదపడే అంశం ఇది. మౌలిక రంగానికి తగిన నిధులు అందుబాటులోకి రావడానికీ ఈ చర్య ఉపయోగపడుతుంది.
– చందా కొచర్, ఐసీఐసీఐ చీఫ్
ఫైనాన్షియల్ స్టెబిలిటీ
తగిన పాలసీ విధానాన్ని ఆర్‌బీఐ అనుసరిస్తోందని నేను భావిస్తున్నాను. ఈ విధానం వల్ల లిక్విడిటీలో ఒడిదుడుకులు తగ్గే వీలుంది. ఆర్థిక స్థిరత్వానికి ఈ చర్యలు వీలు కల్పిస్తాయి. రేట్ల తగ్గింపునకు వీలైన వ్యవస్థ వృద్ధికీ కలిసి వస్తుంది.
– రాణా కపూర్, యస్‌బ్యాంక్ చీఫ్
ఇక బ్యాంకులే తగ్గించాలి..
ఆర్‌బీఐ నిర్ణయంతో ఇక బ్యాంకులే రుణ రేటును తగ్గించాలని తద్వారా ఇప్పటివరకూ అందిన రెపో ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని పారిశ్రామిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. వృద్ధి లక్ష్యంగా ఆర్‌బీఐ మున్ముందు రెపో రేటు తగ్గిస్తూ... తన పాలసీ నిర్ణయాన్ని మార్చుకుంటుందని సైతం కొన్ని వర్గాలు అంచనా వేశాయి.
ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక
ప్రస్తుత ద్రవ్యోల్బణం భయాలను ప్రాతిపదికగా తీసుకుని ఆర్‌బీఐ తాజా పాలసీ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నాం. మున్ముం దు వృద్ధి, డిమాండ్ మెరుగుదల ప్రధాన లక్ష్యంగా రేటు తగ్గింపు దిశలో ఆర్‌బీఐ తన విధానాన్ని మార్చుకుంటుందని విశ్వసిస్తున్నాం.
– చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
ఇక బ్యాంకుల వంతు...
వృద్ధి అంశాలకన్నా తక్షణం లిక్విడిటీ (ద్రవ్య) నిర్వహణ, ద్రవ్యోల్బణం నియంత్రణ లక్ష్యాలుగా ఆర్‌బీఐ తాజా పాలసీ నిర్ణయం తీసుకుంది. అధిక నగదు నిల్వల నేపథ్యంలో నిధుల సమీకరణ వ్యయాల తగ్గుదల ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలి.
– సందీప్ జజోడియా, అసోచామ్ ప్రెసిడెంట్
వినియోగం పెరగాలి
గత పాలసీ రేట్ల కోత ప్రయోజనాలు పరిశ్రమకు అందాల్సి ఉంది. ఈ దిశలో బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు ఇటు వినియోగం, అటు పెట్టుబడులు పెరగడానికి– రెండింటికీ దోహదపడుతుంది.
– పంకజ్ పటేల్, ఫిక్కీ ప్రెసిడెంట్