
ఈ దఫా రేటు కోత ఖాయం..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ఆగస్టు పాలసీ సమీక్ష సందర్భంగా రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని
♦ ఆగస్టు 2 ఆర్‌బీఐ సమీక్షపై విశ్లేషకుల విశ్వాసం
♦ పరిశ్రమల పేలవ స్థితికి ధరల తగ్గుదల కారణమని విశ్లేషణ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ఆగస్టు పాలసీ సమీక్ష సందర్భంగా రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు ప్రస్తుతం 6.25 శాతం ఉన్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం భయాలను కారణంగా చూపుతూ, ఆర్‌బీఐ గడచిన 8 నెలలుగా (నాలుగు ద్వైమాసిక సమీక్షల కాలంలో) ఈ రేటును యథాతథంగా కొనసాగిస్తోంది.
అయితే తాజాగా వెలువడిన మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, ఏప్రిల్ నెల పేలవ పారిశ్రామిక ఉత్పత్తి పని తీరు ఆగస్టు 2 పాలసీ సమావేశంలో రేటు తగ్గింపు నిర్ణయానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం దశాబ్దపు కనిష్ట స్థాయి 2.18 శాతాన్ని తాకిన సంగతి తెలిసిందే. అయితే మే నెల పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి మాత్రం 2016 ఇదే నెలతో పోల్చిచూస్తే 3.1 శాతానికి పడిపోయింది. 2016 మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 6.5 శాతంకాగా, 2017 ఏప్రిల్‌లో రేటు 3.8 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నాటి ఆర్‌బీఐ మూడవ ద్వైమాసిక సమీక్షపై తాజా అంచనాలు, అభిప్రాయాలను చూస్తే...
తగిన పరిస్థితి...
ఆగస్టు సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు తప్పకపోవచ్చు. ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి కొనసాగితే... మా విశ్లేషణకు మరింత బలం చేకూరుతుంది. – ఆర్థిక విశ్లేషణా విభాగం, ఎస్‌బీఐ
జూన్‌లో 2% లోపే...
జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం లోపునకు పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 4 శాతంకన్నా తక్కువ రేటు. రేటు కోతకు దారితీసే అంశమిది. – కొటక్ సెక్యూరిటీస్, బ్రోకరేజ్ సంస్థ
పారిశ్రామిక అవసరాలే కారణం
ఆగస్టు 2వ పాలసీ సమీక్షలో పావుశాతం రెపో రేటు తగ్గింపు తప్పదు. అక్టోబర్ నుంచి పారిశ్రామిక రంగం క్రియాశీలత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రేటు తగ్గింపు ద్వారా బ్యాంకింగ్‌కూ ఇదే విధమైన సందేశాన్ని ఆర్‌బీఐ ఇస్తుందని భావిస్తున్నాం. ఒకవేళ రేటును తగ్గించకపోతే, అది ఇప్పటికే సవాలును ఎదుర్కొంటున్న రుణ వృద్ధికి విఘాతం. – బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్
100% చెప్పలేం...
ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీపై రేటు తగ్గింపు ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ రేటు తగ్గిస్తుందని పూర్తిగా 100 శాతం చెప్పలేం. ద్రవ్యోల్బణానికి సంబంధించి బేస్ ఎఫెక్ట్, 7వ వేతన సంఘం అలవెన్సులు వంటి అంశాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకోవచ్చు. 2018 నాటికి ఆయా అంశాలు ద్రవ్యోల్బణం 4 శాతం పైకి పెరిగేందుకూ దోహదపడే వీలుంది. – ఐడీఎఫ్‌సీ బ్యాంక్