డేటా లోకలైజేషన్.. వినియోగదారుల సమాచారాన్నంతటినీ దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియ.. ఇందుకోసం పేమెంట్ కంపెనీలకు ఆర్‌బీఐ విధించిన గడువు సోమవారంతో పూర్తయింది. ఈ గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని బహుళ జాతి సంస్థలు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో అంతర్జాతీయ కంపెనీల్లో గుబులు పెరిగిపోయింది. ఇక మీదట పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నయినా భారత్ భూభాగంలోని సర్వర్లలోనే ఏ కంపెనీలైనా నిల్వ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల భారత్‌లోని అమెరికా వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన పెరిగిపోతోంది.
గతంలో కొన్ని టెక్ సంస్థలు డేటా లోకలైజేషన్ నిబంధనలు సరికావని, వాటిని సడలించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా సెనేటర్లు జాన్ కార్నిన్, మార్క్ వార్నర్ కూడా దీనికి వ్యతిరేకంగా గళమెత్తారు.‘‘డేటాను స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధనల వల్ల భారత్‌లో వ్యాపారాలు చేయడం కష్టమవుతుంది. పౌరుల సమాచారం గోప్యంగా ఉంచడానికి కంపెనీలన్నీ పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పుడు డేటాను నిల్వ చేసే సర్వర్లు ఎక్కడ ఉంటే వచ్చే నష్టమేమిటి’’ అంటూ ఆ సెనేటర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ అంశంలో అమెరికా, భారత్ ప్రజా ప్రతినిధుల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. లేదంటే విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తుందని వారు హెచ్చరించారు.
అంతర్జాతీయ కంపెనీలపై భారం ఎలా ?
- అంతర్జాతీయ కంపెనీలన్నీ డేలా నిల్వ చేయడం కోసం భారత్‌లో కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు తడిసి మోపెడైపోతుంది.
- ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రాలు ఉండడం వల్ల అదే పని తిరిగి చేయాల్సి వస్తుంది.
- మానవ వనరుల్ని భారత్‌లో వినియోగించాల్సి రావడం కూడా ఆ కంపెనీలకు అదనపు భారమే
- కేవలం చెల్లింపు సంస్థలు మాత్రమే కాకుండా, ఇతరత్రా అన్ని రకాల కంపెనీలు వినియోగదారుల సమాచారాన్ని స్థానికంగా నిల్వ చేయడం వల్ల మార్కెటింగ్ వ్యూహాలను రచించడం కోసం వినియోగదారుల సమాచార సేకరణ సంక్లిష్టంగా మారుతుంది.
దేశీయంగా వరం ఎలా ?
- అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక మోసాలు, అక్రమాలు జరిగినప్పుడు భద్రతా సంస్థలకి సమాచార సేకరణ సులభమవుతుంది.
- డేటా అనలిస్టులు,సైంటిస్టుల వంటి ఉద్యోగాల కల్పన జరుగుతుంది.
- భారత్‌లో పేమెంట్ స్టార్టప్ కంపెనీలకు ఇదో పెద్ద వరం. వ్యాపారాల నిర్వహణలో ఇతర అంతర్జాతీయ సంస్థలతో వాటికీ సమాన అవకాశాలు లభిస్తాయి.
డేటాలో కలైజేషన్ అంటే
వివిధ రకాలైన ఆర్థిక సంస్థలు, చెల్లింపు సంస్థలు, వినియోగదారులతో వ్యవహారాలు ముడిపడే ఇతర సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ వినియోగదారుల సమాచారం ఏ అమెరికాలోనో, ఐరోపాలోని సర్వర్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత గాల్లో దీపంలా మారింది. సమాచార భద్రతా ముసాయిదా బిల్లులో భాగంగా డేటాను దేశీయంగా ఉండే సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలన్న సూచనలు ఉన్నాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రూపొందించిన వ్యక్తిగత సమాచార భద్రతా బిల్లులో అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించే పనిలో కేంద్రం ఉంది. అది చట్టరూపం దాల్చేలోగానే డేటాను లోకలైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆరు నెలల క్రితం ఆర్‌బీఐ మార్గదర్శకాలను రూపొందించింది. గ్లోబల్ డిజిటల్ పేమెంట్ కంపెనీలన్నీ దేశీయంగా సమాచారాన్ని నిల్వ చేయాలంటూ అక్టోబర్ 15వరకు గడువు విధించింది.
కంపెనీల దారెటు ?
అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు కంపెనీలైన వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఫేస్‌బుక్, పేపాల్, మాస్టర్‌కార్డు, గూగుల్ వంటి సంస్థలపై ఈ లోకలైజేషన్ ప్రభావం పడుతుంది. అయితే ఆర్‌బీఐ నిబంధనల్ని పాటిస్తూ స్థానికంగా వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేసే ప్రక్రియ వాట్సాప్ పూర్తి చేస్తే, అలా చేయడానికి గూగుల్ అంగీకరించింది. దేశంలోని మొత్తం 80 పేమెంట్స్ సర్వీసుల్లో 64 కంపెనీలు డేటా లోకల్‌గా నిల్వ చేయడానికి సిద్ధమని ప్రకటించాయి. మరో 16 సంస్థలు గడువు కోరాయి.
అమెజాన్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు మాత్రం డేటా లోకలైజేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల అమెరికా, భారత్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత క్షీణిస్తాయంటూ ఆ సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు చేశాయి.
ఆర్‌బీఐ వేచి చూసే ధోరణి
డేటా లోకలైజేషన్ అంశంలో పలు గ్లోబల్ పేమెంట్ కంపెనీలు గడువు పెంచాలని కోరినప్పటికీ ఆర్‌బీఐ నిరాకరించింది. ఆరు నెలల సమయం ఇచ్చామని, ఇక ఇచ్చే పని లేదని తేల్చి చెప్పింది. భారత్‌లో ఇప్పటికీ సెంటర్లు ఏర్పాటు చేయని కంపెనీలు క్లౌడ్ విధానం ద్వారా సమాచారాన్ని నిల్వ చేసి, అతి త్వరలోనే భారత్ సెంటర్లకి మార్చాలని సూచించింది. అంతవరకు కంపెనీలపై వేచి చూసే ధోరణి అవలింబించాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment