ఈసారికి ఏమీ లేదు.. ‘ధరా’ఘాతం! | RBI Monetary Policy December 2019: Surprise! No Change In Repo And Reverse Repo Rates | Sakshi
Sakshi News home page

ఈసారికి ఏమీ లేదు.. ‘ధరా’ఘాతం!

Published Fri, Dec 6 2019 12:09 AM | Last Updated on Fri, Dec 6 2019 5:08 AM

RBI Monetary Policy December 2019: Surprise! No Change In Repo And Reverse Repo Rates - Sakshi

ముంబై: విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి రేట్ల కోతకు వెళ్లకుండా యథాతథ పరిస్థితికి మొగ్గు చూపించింది. ప్రస్తుతమున్న రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) 5.15 శాతం, రివర్స్‌ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీ) 4.90 శాతాన్ని అలాగే కొనసాగించాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.

దేశ జీడీపీ వృద్ధిరేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 4.5 శాతానికి పడిపోవడంతో (ఆరేళ్ల కనిష్ట స్థాయి), ఒకవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్‌బీఐ ఎంపీసీ.. కనీసం పావు శాతం వరకు రెపో రేటును తగ్గిస్తుందని విశ్లేషకులు, నిపుణులు ఊహించారు. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, రానున్న కాలంలో మరింతగా  పెరిగే అవకాశాలుండటం రేట్ల కోతకు వెళ్లకుండా అడ్డుపడ్డాయి. అంతేకాదు, తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5%కి తగ్గించేసింది.

అక్టోబర్‌ సమీక్షలో వృద్ధి అంచనాను 6.1%గా పేర్కొనటం గమనార్హం. తన సర్దుబాటు విధానాన్ని ఎంపీసీ కొనసాగించడం ఒక్కటే తాజా భేటీలో సానుకూలత. వృద్ధికి మద్దతుగా అవసరమైనంత వరకు ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే తదుపరి సమావేశాల్లో రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతం పంపింది. అంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణమే వడ్డీ రేట్లను నిర్ణయించగలదని స్పష్టం చేసింది. అంతేకాదు, తదుపరి రేట్ల కోత రానున్న బడ్జెట్‌పైనా ఆధారపడి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు. కాగా, తదుపరి ఆర్‌బీఐ పాలసీ సమీక్ష ఫిబ్రవరి 4–6   మధ్య జరగనుంది.

ద్రవ్యోల్బణం పెరగొచ్చు 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.7–5.1 శాతం మధ్య.. 2020–21 మొదటి అర్ధభాగంలో 4.3–4.8 శాతం మధ్య ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ‘‘నాలుగో త్రైమాసికంలో (వచ్చే జనవరి–మార్చి) ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో ఉండొచ్చు. రానున్న నెలల్లో ఇది నియంత్రణలోకి రావడం అన్నది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంది. కూరగాయల ధరల పెరుగుదల ఒకటి, రెండు నెలలు కొనసాగొచ్చు.

ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన పంటల దిగుబడులు, సరఫరా దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2020 ఫిబ్రవరికి కూరగాయల ధరలు శాంతించొచ్చు. టెలికం చార్జీలు పెంచడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. అయితే, టోకు ద్రవ్యోల్బణం మాత్రం ప్రస్తుత స్థాయి 4 శాతం లోపే కొనసాగొచ్చు’’ అని ఆర్‌బీఐ ఎంపీసీ పేర్కొంది. అక్టోబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.6 శాతానికి చేరిన విషయం తెలిసిందే. 4 శాతానికి కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం.

వృద్ధి 5 శాతం 
2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 5 శాతం మేరే ఉండొచ్చని ఎంపీసీ పేర్కొంది. 6.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాలను సవరించింది. 2019–20 రెండో అర్ధభాగంలో (2019 అక్టోబర్‌– 2020 మార్చి) వృద్ధి రేటు 4.9–5.5 శాతం మధ్య.. 2020–21 మొదటి ఆరు నెలల కాలంలో 5.9–6.3 శాతం మధ్య ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. రానున్న కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, వృద్ధిపై వాటి ప్రభావం విషయమై స్పష్టత వస్తుందని పేర్కొంది. డిమాండ్‌ పరిస్థితులు బలహీనంగా ఉన్నట్టు ఎన్నో అంశాలు స్పష్టం చేస్తున్నాయని అభిప్రాయపడింది.

విరామం తాత్కాలికమే...
వడ్డీ రేట్ల సవరణకు విరామం తాత్కాలికమే. ఈ ఏడాది ఐదు సమీక్షా సమావేశాల్లో (ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకు) 135 బేసిస్‌ పాయింట్ల వరకు (1.35%) రేట్లను తగ్గించాం. దీని ప్రభావం ఏ మేర ఉందో చూడాలంటే కొంత సమయం ఇవ్వాలి. బ్యాంకులు ఇంత వరకు 44 బేసిస్‌ పాయింట్ల వరకే రేట్ల తగ్గింపును రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. రేట్ల తగ్గింపు ప్రయోజనం గరిష్ట స్థాయిలో నెరవేరాల్సి ఉంది. అప్పుడే తదుపరి రేట్ల కోతకు అవకాశం ఉంటుంది. వృద్ధి– ద్రవ్యోల్బణం∙పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి విరామమే మేలని ఎంపీసీ భావించింది.

ఒక యంత్రం మాదిరిగా ప్రతీసారి ఆర్‌బీఐ రేట్లను తగ్గించదు. గడిచిన కొన్ని నెలల్లో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం సంయుక్తంగా కొన్ని చర్యలు తీసుకున్నాయి. వాటి ప్రభావాన్ని చూశాక గానీ రేట్లపై నిర్ణయం తీసుకోలేం. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నట్లు ముందస్తు సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, వాటి స్థిరత్వంపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.6%గా నమోదవడం అంచనాల కంటే చాలా ఎక్కువ. ఇటీవలి ప్రభుత్వ చర్యల తో సెంటిమెంట్‌ మెరుగుపడి డిమాండ్‌ ఊపందుకుంటుంది. ప్రభుత్వం ద్రవ్యలోటుపై ఆందోళన చెందడం లేదు. వృద్ధి కోసం ప్రభుత్వం, ఆర్‌బీఐ సమన్వయంతో పనిచేస్తాయి. – శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

కొత్తగా ప్రీపెయిడ్‌ కార్డు
కొత్తగా ఒక ప్రీపెయిడ్‌ కార్డు(ముందస్తు చెల్లింపుల సాధనం/పీపీఐ)ను తీసుకురావాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. రూ.10,000 వరకు వస్తు, సేవల కొనుగోళ్లకు మాత్రమే దీన్ని వాడొచ్చని పేర్కొంది. డిజిటల్‌ చెల్లింపులను పెంచే విషయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని పేర్కొంది.

ఒక్క ఎన్‌బీఎఫ్‌సీనీ కూలిపోనివ్వం
సమస్యల్లో ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక రంగాన్ని (ఎన్‌బీఎఫ్‌సీ) నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ఏ ఒక్క ఎన్‌బీఎఫ్‌సీ కుప్పకూలకుండా చూస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ అభయమిచ్చారు. నిర్వహణ బాగున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఇటీవల నిధుల సరఫరా పెరిగిందన్నారు. సెంట్రల్‌ బ్యాంకు బృందం అగ్రస్థాయి 50 ఎన్‌బీఎఫ్‌సీలను (మార్కెట్‌ వాటాలో 70 శాతం వీటిదే) చాలా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. వ్యవస్థాపరంగా ముఖ్యమైన ఏ ఒక్క ఎన్‌బీఎఫ్‌సీ కూలిపోకుండా, సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటామని వివరించారు. వీటికి సంబంధించిన పుస్తకాలను లోతుగా పరిశీలించి ఒత్లిళ్లను గుర్తించినట్టు చెప్పారు. కంపెనీల యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు సమావేశమై, బలోపేతానికి చర్యలు కూడా సూచిస్తున్నట్టు వెల్లడించారు.

పీ2పీ వ్యాపారానికి బూస్ట్‌
పీ2పీ ప్లాట్‌ఫామ్‌ల పురోగతి దిశగా ఆర్‌బీఐ ఒక నిర్ణయం తీసుకుంది. పీ2పీ అనేవి.. వ్యక్తుల మధ్య రుణాల మంజూరు, రుణాల స్వీకరణకు వీలు కల్పించే  ఆన్‌లైన్‌ వేదికలు. ప్రస్తుతం ఒక రుణదాత అన్ని పీ2పీ ప్లాట్‌ఫామ్‌ల పరిధిలో గరిష్టంగా రూ.10 లక్షల వరకే రుణాల పంపిణీకి, అదే విధంగా ఒక రుణ గ్రహీత కూడా గరిష్టంగా రూ.10లక్షల వరకే రుణం పొందే అవకాశం ఉండగా.. దీన్ని రూ.50లక్షలకు ఆర్‌బీఐ తాజాగా పెంచింది. అలాగే, ఒక రుణదాత, ఒక వ్యక్తికి గరిష్టంగా రూ.50వేలకే రుణం సమకూర్చే పరిమితి కూడా అమల్లో ఉంది.

ఆశ్చర్యకర నిర్ణయం...
ఊహించని పాలసీ ఆశ్చర్యపరిచింది. అయినా ఎంతో సముచితమైనది. వృద్ధి అంచనాలను ఈ ఆర్థిక సంవత్సరానికి 5%కి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా తగ్గించడం అన్నది రికవరీ(పుంజుకోవడం) నిదానంగా ఉంటుందని తెలియజేస్తోంది. – రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌

అధిక ధరలే కారణం... 
ద్రవ్యోల్బణం కఠినంగా మారడం, పెరిగి పోయే అంచనాలకు ఆర్‌బీఐ స్పందించినట్టు అర్థమవుతుంది. 135 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు ప్రయోజనం పూర్తిగా నెరవేరే వరకు వేచి చూడాలని భావిస్తోంది. – అభిషేక్‌ బారువా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త

నిరాశ పరిచింది...
ఆర్‌బీఐ రెపో రేటు ను మార్చకపోవడంపై నిరాశ చెందాం. వృద్ధి బలహీనత పరిస్థితుల్లో రేట్ల కోత అవసరం అన్న ఫిక్కీ విధానానికి విరుద్ధంగా ఉంది. గతంలో రేట్ల కోత ప్రయోజనం కూడా పూర్తిగా అమలు కాలేదు. మార్కెట్, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. – సందీప్‌ సోమాని, ఫిక్కీ ప్రెసిడెంట్‌

సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుంది.. 
ఆర్‌బీఐ వేచిచూసే ధోరణి రియల్టీ రంగంలో  సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తుంది. స్వల్ప మొత్తాల్లో పావు శాతం చొప్పున కాకుండా 100 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల కోతను మేం అంచనా వేశాం.
– నిరంజన్‌ హిరనందాని, నారెడ్కో ప్రెసిడెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement