RBI Monetary Policy: RBI Governor Key Announcement On Repo Rate In 2022-2023, Details Inside - Sakshi
Sakshi News home page

ఎకానమీకి ‘యుద్ధం’ సెగ!

Published Fri, Apr 8 2022 10:51 AM | Last Updated on Sat, Apr 9 2022 5:19 AM

Repo Rate Unchanged In 2022 -2023 - Sakshi

ముంబై: భారత్‌ ఎకానమీపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం  తీవ్రంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది.

ఇక పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ కమిటీ అంచనావేసింది. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి.

అప్పర్‌ బ్యాండ్‌ దిశలో ద్రవ్యోల్బణం అంచనా పెరగడం కొంత ఆందోళనకరమైన అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ వృద్ధికి ఊతం ఇవ్వడం తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని ఆర్‌బీఐ ప్రకటించింది. ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని సమీక్షా సమావేశం నిర్ణయించింది.

దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లోనూ ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. వృద్ధికి–ఎకానమీ సమతౌల్యతకు అనుగుణమైన (అకామిడేటివ్‌) పాలసీ విధానాన్ని కొనసాగిస్తామని సమీక్షా సమావేశం పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక సమీక్షా సమావేశం తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు పరిశీలిస్తే...

► బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత)కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మార్జినల్‌ స్టాడింగ్‌ ఫెసిలిటీ రేటును (ఎంఎస్‌ఎఫ్‌) కూడా యథాపూర్వ 4.25 శాతం వద్ద కొనసాగనుంది. ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డబ్బును అందించి వసూలు చేసే వడ్డీరేటు ఇది. స్వల్పకాలిక (ఓవర్‌నైట్‌) నిధుల అవసరాలకు బ్యాంకింగ్‌ ఈ విండోను వినియోగించుకుంటుంది.
► లిక్విడిటీ సమస్యల నివారణకు బ్యాంక్‌ రేటు కూడా యథాతథంగా 4.25%గా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెపో రేటు అనేది బాం డ్ల కొనుగోలు ప్రక్రియ ద్వారా వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ  రుణాలు ఇచ్చే రేటు.  అయితే బ్యాంక్‌ రేటు అనేది వాణిజ్య బ్యాం కులు ఎటువంటి పూచీకత్తు  లేకుండా ఆర్‌బీఐ నుండి రుణం పొంది, అందుకు చెల్లించే వడ్డీరేటు.  
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్‌ ఆయిల్‌ (ఇండియన్‌ బాస్కెట్‌) బ్యారల్‌ ధర 100 డాలర్లుగా అంచనావేసింది. ఈ ప్రాతిపదికన వృద్ధి అంచనాలను కుదించింది.
► గ్రామీణ ప్రాంతంలో డిమాండ్‌ రికవరీకి రబీ ఉత్పత్తి దోహదపడుతుంది.   
► కాంటాక్ట్‌–ఇంటెన్సివ్‌ సేవలు పుంజుకునే అవ కాశాలు కనిపిస్తున్నాయి. హోటల్‌లు, రెస్టారెంట్‌లు, టూరిజం–ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లు, అడ్వెంచర్‌/హెరిటేజ్‌ సౌకర్యాలు, విమానయాన అనుబంధ సేవలు ఈ విభాగం కిందకు వస్తాయి.  
► ప్రభుత్వ పెట్టుబడుల ప్రణాళిక, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి, వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డంతో దేశంలో పెట్టుబడుల క్రియాశీలత పుంజుకుంటుంది.
► ఆర్‌బీఐ నియంత్రణలోని ఫైనాన్షియల్‌ మార్కెట్ల ప్రారంభ సమయం ఏప్రిల్‌ 18 నుండి ఉదయం 9. ఈ మేరకు మహమ్మారి ముందస్తు సమయాన్ని పునరుద్ధరించడం జరిగింది.  
► హేతుబద్ధీకరించబడిన గృహ రుణ నిబంధన లు 2023 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు.
► వాతావరణానికి సంబంధించి సమస్యలు, నివారణకు తగిన నిధుల కల్పనపై త్వరలో ఒక చర్చా పత్రం విడుదల
► ఆర్‌బీఐ నియంత్రిత సంస్థల్లో వినియోగదారుల సేవల ప్రమాణాల సమీక్ష కోసం కమిటీ.


ఇక కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయెల్స్‌...
యూపీఐ వినియోగం ద్వారా కార్డ్‌ లెస్‌ నగదు ఉపసంహరణ సౌలభ్యతను అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్‌లకు విస్తరించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. మోసాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ, ఏటీఎంల ద్వారా కార్డ్‌–లెస్‌ నగదు ఉపసంహరణకు దేశంలోని కొన్ని బ్యాంకులకు అనుమతి ఉంది.

అదనపు లిక్విడిటీకి ‘ఎస్‌డీఎఫ్‌’ మందు
వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఉపసంహరణ ప్రక్రియకు ఆర్‌బీఐ శ్రీకారం చుట్టింది. రానున్న కొన్ని సంవత్సరాల్లో క్రమంగా మహమ్మారి ముందస్తు సాధారణ స్థాయిలకు ద్రవ్యతను తీసుకువెళ్లాలన్న లక్ష్య సాధనకు  స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌) ఇన్‌స్ట్రమెంట్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా లిక్విడిటీ అడ్జెస్ట్‌మెంట్‌ ఫెసిలిటీ (ఎల్‌ఏఎఫ్‌)ను ప్రస్తుత 0.9 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ రేటు 3.75 శాతంగా ఉంటుంది.

గృహ విక్రయాలకు ఊతం
గృహ విక్రయాలు పెరగడానికి పాలసీ దోహదపడుతుంది. కోవి డ్‌–19 అనంతరం కీలక సమస్యల్లో ఉన్న పలు రంగాల పురోగతికి, ఆర్థికాభివృద్ధికి విధాన నిర్ణయాలు బలం చేకూర్చుతాయి.  అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకునేందుకు చర్యలతోపాటు వ్యవస్థలో ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తీసుకున్న చర్యలు హర్షణీయం.
– హర్ష వర్థన్‌ పటోడియా,  క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌

ఆచరణాత్మక విధానం
ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణంలో ఆచరణాత్మక  విధాన నిర్ణయాలను ఆర్‌బీఐ తీసుకుంది. ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సరిగ్గా మదింపు చేసింది. వృద్ధికి విఘాతం కలగని రీతిలో లిక్విడిటీ సర్దుబాటు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రుణ సమీకరణ విధానానికి మద్దతుగా పలు చర్యలు ఉన్నాయి. దీర్ఘకాలంలో పటిష్ట వృద్ధికి దోహదపడే విధానమిది.  
–దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చీఫ్‌

చదవండి: 

చదవండి: డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లకు లైన్‌ క్లియర్‌, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement