
న్యూఢిల్లీ : పట్నాలో మళ్లీ డిమానిటైజేషన్ రోజులు పునరావృతమవుతున్నాయి. రెండు రోజుల నుంచి పట్నా వాసులు పెద్ద నోట్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఏటీఎంలకు రూ.500, రూ.2000 నోట్ల సరఫరాను ఆర్‌బీఐ నిలిపివేసింది. ఆర్‌బీఐ నుంచి పెద్ద నోట్ల సరఫరా ఆగిపోవడంతో పెద్ద నోట్ల కొరత సమస్య తలెత్తింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన దాదాపు 300 ఏటీఎంలకు పెద్ద నోట్ల సప్లై ఆగిపోవడంతో అక్కడి ప్రజలకు ఈ ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచు చీఫ్ మేనేజర్ సయ్యద్ ముజఫర్ ఆర్‌బీఐను సంప్రదించిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు నగదును అందించడానికి బ్యాంకు బ్రాంచు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
మరోపక్క గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద నోట్లను అక్కడికి తరలించడంతోనే ఇక్కడ నిలిచిపోయినట్లు ఆర్జేడీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అక్కడ పెద్దనోట్లతో ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్జేడీ విమర్శలపై స్పందించిన బిహార్ బీజేపీ లీడర్ మంగళ్ పాండే... విపక్షాలు గుజరాత్ ఫోబియాతో బాధపడుతున్నాయన్నారు. తాత్కాలిక సమస్యలకు అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేయకూడదని త్వరలో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.