ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్ ఇక ఎంతో సులువు!
ముంబై: నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 45 డాక్యుమెంట్లతో కూడిన భారీ చిట్టాను సమర్పించాల్సి వచ్చేది. దీన్ని ఎనిమిది డాక్యుమెంట్లకు కుదించినట్టు ఆర్‌బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏదేనీ అదనపు సమాచారం, పత్రాన్ని కోరినట్టయితే సంస్థలు 30 రోజుల్లోపు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అలాగే, ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి రెండు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయని స్పష్టం చేసింది. టైప్-1 విధానంలో నిధులు సమీకరణకు అవకాశం లేని (ఎన్‌బీఎఫ్‌సీ-ఎన్‌డీ) సంస్థల దరఖాస్తు పరిశీలనను వేగంగా పూర్తిచేయనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఈ సంస్థలు ప్రజల నుంచి నిధులు సేకరించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ భవిష్యత్తులో ఈ విధమైన లావాదేవీలు కూడా నిర్వహించుకోవాలని భావిస్తే అందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.