ఆర్‌కామ్ కాల్ రేట్లు పెరిగాయ్
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రధాన టారిఫ్‌ల కాల్ రేట్లను 20 శాతం పెంచింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుందని కంపెనీ బుధవారం తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ పెరుగుదల అమల్లోకి వస్తుందని కంపెనీ సీఈవో (కన్సూమర్ బిజినెస్)గుర్దీప్ సింగ్ చెప్పారు. సెకన్‌కు 1.5 పైసలుగా ఉన్న టారిఫ్‌ను 1.6 పైసలకు పెంచామని వివరించారు. దీంతో డిస్కౌంటెడ్ టారిఫ్‌లు పొందే వినియోగదారుల బిల్లులు 20 శాతం పెరుగుతాయని వివరించారు.
అంతే కాకుండా రూ.43, రూ.148, రూ.259 స్పెషల్ టారిఫ్ వోచర్లకు ఆఫర్ చేసే నిమిషాల సంఖ్యను కూడా తగ్గించామని పేర్కొన్నారు. పెరుగుతున్న వ్యయాలను తట్టుకోవడానికి, ఉచిత, డిస్కౌంట్ మినిట్స్‌ను తగ్గించే వ్యూహాంలో భాగంగా ఈ టారిఫ్‌లను పెంచామని తెలిపారు. ఈ టారిఫ్‌ల పెంపు కారణంగా ఆదాయం మెరుగుపడుతుందని, లాభదాయకతపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు.
ఇతర కంపెనీలదీ అదే దారి
భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలూ కాల్ రేట్లను పెంచాయి. డిస్కౌంట్ స్కీమ్‌లకు సం బంధించిన టారిఫ్‌లను పెంచడమే కాకుండా కొన్ని ఉచిత ప్రయోజనాలను తగ్గించాయి. వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు వోచర్ల వ్యాలిడిటీని 30 రోజుల నుంచి 24కు తగ్గించాయి. మొబైల్ ఇంటర్నెట్ సేవలందించడానికి భారీగానే పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని, రేట్లను పెంచడం మినహా మరో మార్గమేదీ లేదని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విట్టల్ గత నెలలోనే పేర్కొన్నారు.