
పన్ను పత్రాల దాఖలుకు సిద్ధమా..
నూతన సంవత్సరం వేడుకల హడావుడి ఇంకా పూర్తి కాలేదు. కొత్త సంవత్సరంలో సాధిద్దామనుకుంటున్న లక్ష్యాల ఊహలు చాలానే ఉండొచ్చు. అయితే వీటి నుంచి కాస్త వాస్తవ ప్రపంచంలోకి తక్షణం రాకతప్పదు. ఎందుకంటే...ఊహలెలా ఉన్నా ఆదాయ పన్ను లెక్కలు సరి చూసుకోవాల్సిన సమయమిది. పన్ను పోటును తగ్గించుకునే దిశగా అవసరమైన పత్రాలు సమర్పించాల్సిన తరుణమిది. మీరు వేతన జీవులైనా లేకపోతే స్వంతంగా బిజినెస్ చేసుకుంటున్న వారైనా.. ఎవరైనా సరే వీటిని సమర్పించాల్సిందే. పన్ను పోటు తగ్గించే పెట్టుబడులు, మినహాయింపులిచ్చే ఇతరత్రా పత్రాలు మొదలైన వాటి గురించి తెలియజేసేది ఈ కథనం.
సెక్షన్ 80సీ పెట్టుబడులు
ట్యాక్స్ ప్లానింగ్‌లో సెక్షన్ 80సీ పెట్టుబడులు కీలకపాత్ర పోషిస్తాయి. ఇది ఆదాయ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించగలదు. కాబట్టి.. ఈ సెక్షన్ కింద పేర్కొనతగిన కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి.
♦ ఎల్‌ఐసీ ప్రీమియం రసీదులు
♦ ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్స్ (మ్యూచువల్ ఫండ్)పెట్టుబడుల వివరాలు
♦ ప్రావిడెంట్ ఫండ్‌కి కట్టిన చందాలు
♦ రిటైర్మెంట్ ప్లాన్ల కోసం చెల్లించిన ప్రీమియంల రసీదులు
♦ పిల్లల స్కూలు ఫీజు చెల్లింపు రసీదులు
♦ గృహ రుణం తీసుకున్న పక్షంలో అసలు మొత్తం చెల్లించిన రసీదు
♦ ఎన్ ఎస్‌సీ బాండ్లేమైనా కొనిఉంటే ఆ పత్రాలు
♦ పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఆ తరహా డిపాజిట్ల వివరాలు
♦ పింఛను ఖాతా, నేషనల్ పెన్షన్ స్కీముకు కట్టిన చందాలు
ఇతర సెక్షన్ల కింద పెట్టుబడులు
80సీ కాకుండా ఇతరత్రా సెక్షన్ల కింద కూడా కొన్నింటికి పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ కింద పేర్కొన్నవి ఆ జాబితాలోకి వస్తాయి.
♦ తనకు లభించే హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) కన్నా అధికంగా చెల్లించిన అద్దె పత్రాలు.
♦ ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలు
♦ స్వంతానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకి తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు కట్టే ప్రీమియంలు
♦ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై రూ. 10,000కు మించని వడ్డీ వివరాలు
♦ గృహ రుణంపై చెల్లించే వడ్డీ రసీదు
♦ స్వంతానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకు అయ్యే వైద్య చికిత్స వ్యయాలు
♦ సెక్షన్ 80జీ కింద ప్రధానమంత్రి సహాయ నిధి లాంటి వాటికి ఇచ్చే విరాళాలు
♦ రాజకీయ పార్టీలకి ఇచ్చే చందా రసీదులు
♦ పేటెంట్లు,రాయల్టీల రూపంలో లభించే ఆదాయ రసీదులు
♦ విద్యా రుణంపై వడ్డీ పత్రాలు
♦ క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించి స్టాక్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్లు
పత్రాలు సిద్ధంగా ఉండాలి
పన్ను మినహాయింపులనిచ్చే పెట్టుబడులు, వ్యయాలకు సంబంధించి ఈ జాబితాల్లో ఇచ్చినవే కాకుండా ఇతరత్రా కూడా చాలా పత్రాలే ఉన్నాయి. అయితే సింహభాగం ఇందులో పేర్కొన్నవే ఉంటాయి. జనవరి ఆఖర్లోగా.. మీ ఆఫీస్‌లో కోరిన ఫార్మాట్‌లో తక్షణం అందించేందుకు ఒరిజినల్స్ అన్నింటినీ దగ్గరపెట్టుకోవడం శ్రేయస్కరం. లేకపోతే మీ శాలరీ నుంచి మరింత ఎక్కువ టీడీఎస్ కట్ చేసేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్లీ దాన్ని రాబట్టుకునేందుకు క్లెయిమ్‌లు గట్రా దాఖలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుత ప్రక్రియ కాస్త కష్టంగా అనిపించినా అవసరమైన పత్రాలన్నీ తక్షణం అందజేసేందుకు సిద్ధంగా ఉంచుకుంటే.. తర్వాత బోలెడంత సమయం ఆదా అవుతుంది.
శ్రమా తప్పుతుంది. అంతేకాకుండా ఒక కీలకమైన పనిని సకాలంలో పూర్తి చేశామన్న సంతృప్తీ మిగులుతుంది. కాబట్టి.. నెలాఖరులోగా అందజేయాల్సిన పత్రాల జాబితా తయారు చేసుకుని, రసీదులు.. ఒరిజినల్స్ అన్నీ సిద్ధం చేసుకోండి. ప్రతీసారి కొత్త సంవత్సరం వేళ చేసుకునే తీర్మానాలను నెల గడవకముందే బుట్టదాఖలా చేసినట్లు కాకుండా.. ఈసారి పట్టు తప్పకుండా ఆర్థిక ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని గట్టిగా తీర్మానించుకోండి. ఆచరించి ప్రయోజనాలు పొందండి.