తెలంగాణలో రియల్ జోరు! | real estate josh in telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రియల్ జోరు!

Published Sat, May 10 2014 12:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

తెలంగాణలో రియల్ జోరు! - Sakshi

తెలంగాణలో రియల్ జోరు!

* హైదరాబాద్‌కు దీటుగా ద్వితీయ శ్రేణి నగరాలు
* వరంగల్‌లో 40%, కరీంనగర్‌లో 30% పెరిగిన స్థిరాస్తి ధరలు
* భాగ్యనగరంలో వృద్ధి అంతంతే
* రాజధానిలో అనిశ్చితే కారణమంటున్న నిపుణులు
 
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారం అనగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాదే. కానీ, రెండేళ్లుగా భాగ్యనగరంలో రియల్ వ్యాపారం పడకేసింది. అయితే ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో రియల్ వ్యాపారం జోరందుకుంది. ప్రత్యేకించి వరంగల్‌లో 40 శాతం, కరీంనగర్‌లో 30 శాతం మేర ధరలు పెరిగాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. వారం రోజుల్లో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో పన్ను రాయితీలు, సరికొత్త పథకాలతో దేశ, విదేశీ కంపెనీలు మరింత దృష్టి సారించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత అన్ని రంగాలనూ ఆకర్షించే సత్తా గల వరంగల్, కరీంనగర్ జిల్లాల అభివృద్ధి అవకాశాలపై ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది..

 తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో హైటెక్ ప్రాంతమేదైనా ఉందంటే అది వరంగల్ జిల్లానే. వరంగల్, హన్మకొండ, కాజీపేట మూడు నగరాలను ‘ట్రై సిటీస్’గా పిలుస్తారు. తెలంగాణ రాష్ర్ట ప్రకటన తర్వాత అందరి చూపు వరంగల్, కరీంనగర్ జిల్లాలపైనే పడింది. దీంతో వరంగల్‌లో 40 శాతం, కరీంనగర్‌లో 30 శాతం స్థిరాస్తి ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం, ఐటీ, ఫార్మా, కాటన్ వంటి పరిశ్రమలతో అభివృద్ధి చెందటం, త్వరలో గ్రేటర్‌గా రూపాంతరం చెందటం, విమానాశ్రయాల ఏర్పాటు వంటి కారణాలనేకం.

ఐటీ, ఫార్మా వంటి పరిశ్రమలకే కాదు విద్యా, వైద్యానికి కూడా వరంగల్ కేంద్ర బిందువుగా మారనుంది. కొత్త రాష్ట్రాల్లో పన్ను మినహాయింపులుంటాయని కేంద్రం ప్రకటించడంతో, విమానాశ్రయాన్ని పునరుద్ధరణ చేస్తామని పార్టీలూ ప్రకటించడం వంటి వాటితో పరిశ్రమల్లో ఉత్సాహం పెరిగింది. ఐటీ రంగంలో.. హైదరాబాద్-వరంగల్ రోడ్ ఐటీ కారిడార్‌గా మారనుంది. ఇప్పటికే మడికొండలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు 30 ఎకరాలను స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా అభివృద్ధి చేయనుంది.

ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌కు వంద కి.మీ. దూరంలో ఉండటం, నేషనల్ హైవేతో అనుసంధానమై అన్ని రకాల రవాణా మార్గాలుండటం వంటివెన్నో ఐటీ కంపెనీలకు కలిసొస్తున్నాయి. పత్తి, నూనె పంటలకు, ఖనిజాలకు, అటవీ ప్రాంతాలకు వరంగల్ పేరుగాంచింది కాబట్టి ఇక్కడ వ్యవసాయ, ఖనిజాధారిత, అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని ఫ్యాప్సీ సూచించింది. ఖమ్మం, నర్సంపేట రోడ్లు ఎడ్యుకేషనల్ హబ్‌గా, పెట్టబడుల ప్రాంతంగా అభివృద్ధి చెందనుందని నిపుణులు చెబుతున్నారు.

 మూడేళ్లుగా రియల్ జోరు: వరంగల్‌లో మూడేళ్ల నుంచి స్థిరాస్తి ధరలు పెరిగాయని వరంగల్ చాప్టర్ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఏటా వరంగల్‌లో 500 నుంచి వెయ్యి వరకు ఫ్లాట్లను విక్రయిస్తామన్నారు. నక్కలగుట్ట, కేయూ వర్శిటీ వంటి ప్రాంతాల్లో, మెయిన్ రోడ్‌కు ఇరువైపులా గజం ధర రూ.లక్షకు పైగానే పలుకుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నాలుగేళ్ల క్రితం చ.అ. ధర రూ.2,000లున్న ప్రాంతాల్లో ఇప్పుడు రూ.2,200 నుంచి 2,700 మధ్య ఉంది. ఇప్పటికే వరంగల్‌లో కీర్తిలాల్, కల్యాణ్ వంటి జువెల్లరీ షాపులు, శ్రీదేవీ మల్టికాంప్లెక్స్, రిలయన్స్, మెగామార్ట్, కళానికేతన్, సెంట్రో వంటి షాపింగ్ మాళ్లున్నాయి. శ్రీ బాలాజీ కన్‌స్ట్రక్షన్స్ కేయూ యూనివర్శిటీ క్రాస్ రోడ్‌లో ‘గేట్ వే’ పేరుతో 2 లక్షల 50 వేల చ.అ. విస్తీర్ణంలో షాపింగ్ మాల్‌ను నిర్మిస్తోంది. హన్మకొండలో కేఎఫ్‌సీ, డీ-మార్ట్, బిర్లా గ్రూప్ సంస్థలు, నర్సంపేట్ రోడ్‌లో వాల్‌మార్ట్ రానున్నాయి. కొత్త రాష్ర్టంలో పన్ను మినహాయింపులూ ఉండటంతో ఇప్పుడు మల్టినేషనల్ బ్రాండ్ కంపెనీలు క్యూ కడతాయని నిపుణులు చెబుతున్నారు.

 మొదట దృష్టి పెట్టాల్సిందిక్కడే: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకానున్న కొత్త ప్రభుత్వం వరంగల్‌లో మొదటగా దృష్టి పెట్టాల్సిన కొన్ని అంశాలున్నాయని వరంగల్ చాప్టర్ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
* వరంగల్ మున్సిపాలిటీలో నేటికీ 1971 నాటి మాస్టర్‌ప్లాన్నే అమలు చేస్తున్నారు. దీంతో అభివృద్ధి నలువైపులా జరగట్లేదు. కొత్త మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. రాబోయే ప్రభుత్వం వెంటనే మాస్టర్ ప్లాన్‌కు ఆమోదించాలి.

వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలి. ఓఆర్‌ఆర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ తగ్గుతుంది. లక్షల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది. రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో 70 శాతం ప్రభుత్వం, 30 శాతం ప్రైవేటు వ్యక్తులు భరించేందుకైనా సిద్ధంగా ఉండాలి.

* వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ చేయాలి. పారిశ్రామిక ప్రాంతాల నుంచి ప్రధాన నగరాలకు రైల్వే కనెక్టివిటీ. నగరాలను అనుసంధానిస్తూ పారిశ్రామిక వాడలకు రేడియల్ రోడ్లును నిర్మించాలి.

 కరీంనగర్‌కూ పెద్దపీటే..
 తెలంగాణలో నాల్గో అతిపెద్ద నగరం కరీంనగర్. 3 లక్షల జనాభాతో 11,823 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు గని సింగరేణి, 2,600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రామగుండం ఎన్టీపీసీలతో దేశంలో గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందనున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరీంనగర్‌లో బొగ్గు గనులు ఉన్న దృష్ట్యా విద్యుదుత్పాదనకు అపార అవకాశాలున్నాయి. పత్తి, నూనె, రైస్ మిల్లుల స్థాపనకు కరీంనగర్ అనుకూలమని ఫ్యాప్సీ చెబుతోంది.

రియల్ వ్యాపారం విషయానికొస్తే.. రెండేళ్లుగా కరీంనగర్‌లో భూమి ధర 50 శాతానికి పైగా, ఫ్లాట్ల ధరలు 30 శాతం మేర పెరిగాయని కరీంనగర్ చాప్టర్ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ప్రెసిడెంట్ అజయ్ కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. చ.అ. రూ.1200-1,500 మధ్య ఉండేది కాస్త ఇప్పుడు రూ.2,500-2,700 మధ్య పలుకుతోందన్నారు. ఏటా కరీంనగర్‌లో 2 వేల ఫ్లాట్లను విక్రయిస్తున్నామన్నారు.

* జగిత్యాల రోడ్‌లో ఎకరం విస్తీర్ణంలో రిలయన్స్ సూపర్ మెగామార్ట్ నిర్మాణం జరుగుతోంది. కేఎఫ్‌సీ, మెగ్ డొనాల్డ్ వంటి ఫుడ్ సెంటర్లూ రానున్నాయి. ఇప్పటివరకు కరీంనగర్‌లో ఐదంతస్తుల భవనాలు మాత్రమే ఉండేవి. శ్రీనివాస్ బిల్డర్స్ గణేష్‌నగర్‌లో పదంతస్తుల హై రైజ్ బిల్డింగ్‌ను నిర్మిస్తోంది. కమాన్ ఏరియా, బైపాస్ రోడ్‌లో 80 వేల చ.అ., 70 వేల చ.అ. విస్తీర్ణంలో రెండు భారీ వాణిజ్య సముదాయాలు రానున్నాయి. మరో 70 నివాస భవన సముదాయాలు నిర్మాణ  అనుమతి కోసం వేచిచూస్తున్నాయి.

* పభుత్వ ఇసుక యార్డ్ లేని కారణంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇసుకను కొనాల్సి వస్తోంది. దీంతో ట్రాక్టర్ ఇసుక ధర రూ.600-700 మధ్య ఉండేది కాస్త రూ.2,500-3,300లుగా చెబుతున్నారు. వచ్చే కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరారు.

* కరీంనగర్‌కు ఔటర్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తే ట్రాఫిక్ తగ్గడమే కాకుండా 500-600 ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందన్నారు.
 
 వారం రోజుల్లో తెలంగాణ రాష్ర్టంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి పలు సూచనలు చేశారు.

* చిన్న, పెద్ద ఎలాంటి ప్రాజెక్ట్‌లైనా ప్రారంభించేందుకు ముందుకొచ్చే దేశ, విదేశీ నిర్మాణ సంస్థలను ప్రాజెక్ట్ అనుమతుల కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా.. 15 నుంచి 30 రోజుల్లోనే ప్రాజెక్ట్ అనుమతులివ్వాలి. లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

* గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) వంటి ప్రాజెక్ట్‌లో  మాదిరిగా తెలంగాణలో ఏ చిన్న పరిశ్రమనైనా స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పించి ఇవ్వాలి.

* ఐదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు వ్యాట్, రిజిస్ట్రేషన్ చార్జీల వంటి పన్నుల్లో మినహాయింపులివ్వాలి. హైదరాబాద్‌కు తప్ప తెలంగాణలోని వెనకబడిన జిల్లాల్లో పన్ను మినహాయింపులివ్వాలి.

* పన్ను రాయితీలు, త్వరితగతిన అనుమతులు వంటి హామీలను నోటిమాటిలతో సరిపెట్టకుండా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలను నెరవేరిస్తే పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుంది.

* ఏటా భూమి ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచొద్దు. భూములను వేలం వేయటమూ చేయకూడదు. దీంతో ప్రభుత్వమే ధరలు పెంచుతోందని ప్రైవేటు వ్యక్తులూ స్థిరాస్తి ధరలను పెంచేస్తున్నారు. దీంతో ధరలు అందుబాటులో ఉండట్లేదు.

* సిమెంట్, ఇసుక, ఇటుక, ఉక్కు వంటి నిర్మాణ  సామగ్రి ధరలను ఏటా పెంచరాదు. సిమెంట్ ఫ్యాక్టరీలు స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలు తాండూర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. ఏటా ఆదిలాబాద్ నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు, తాండూర్ నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుంది. వీటి సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి.

* తెలంగాణ రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడనుంది. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పూర్తయితే విద్యుత్ కొరత 11 వేల మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో బొగ్గు, సౌర, పవన, బయోమాస్ విద్యుత్ కేంద్రాలను పెద్దఎత్తున నెలకొల్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement