బంగారంపై ఇక ఆర్‌ఆర్‌బీలు 2 లక్షల వరకూ రుణం!
ముంబై: రీజినల్ రూరల్ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ) ఇక మీదట పసిడిపై రూ. 2 లక్షల వరకూ రుణం ఇచ్చే వెసులుబాటు లభించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ రూ.లక్షకే ఈ మొత్తం పరిమితమయ్యింది.
నిబంధనలు ఉన్నాయ్...
తాజా నోటిఫికేషన్ ప్రకారం– పునఃచెల్లింపుల కాలపరిమితి ఎట్టి పరిస్థితుల్లోనూ 12 నెలలు దాటకూడదు. ఒక ఆభరణం మార్కెట్ ధరలో 75 శాతం వరకూ మాత్రమే రుణంగా మంజూరు చేయాల్సి ఉంటుంది. వడ్డీసహా చెల్లింపు కాలపరిమితి మొత్తానికి ఇదే నిష్పత్తి నిర్వహణ జరిగేలా రుణం సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నిష్పత్తి దాటితే దానిని మొండి బకాయిగా (ఎన్‌పీఏ) పరిగణించాల్సి ఉంటుంది. ఇక పసిడి లేదా ఆభరణాల తనఖాపై పంట రుణాల మంజూరు సందర్భాల్లో– ఆదాయం, ఆస్తి విలువ, ప్రొవిజనింగ్ నిబంధనలు అన్నింటినీ తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.