ఆ కారు ధర రూ. లక్ష తగ్గింది..!
రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీని కొనాలనుకుంటున్నారా..అయితే మీకు శుభవార్త. రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీ ధరను ఏకంగా లక్ష రూపాయల వరకూ తగ్గిస్తూ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతి సుజుకీ ఎర్టిగాలకు పెరుగుతున్న జనాదరణతో, రెనాల్ట్ ఇండియా తన లాడ్జీ ఎంపీవీ ధరను తగ్గించేసింది. ఓల్డ్ ఎంపీవీ అమ్మకాలు పెంచడానికి రెనాల్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపుతో 84బీహెచ్ పీ వేరియంట్ ధరల్లో మార్పులు రాగా.. 108బీహెచ్ పీ వేరియంట్ ధర మాత్రం అదేమాదిరి ఉన్నాయి.
రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీ కొత్త ధరలు(ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) :
లాడ్జీ ఎస్ టీడీ - రూ.7,58,831( తగ్గింపు రూ.96వేలు)
లాడ్జీ ఆర్ఎక్స్ఈ - రూ.8,56,831( తగ్గింపు రూ.80వేలు)
లాడ్జీ ఆర్ఎక్స్ఎల్ - రూ.9,43,831(తగ్గింపు రూ.55వేలు)
లాడ్జీ ఆర్ఎక్స్ జడ్ - రూ.10,99,000(తగ్గింపు రూ.34వేలు)
రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీను 2015 ఏప్రిల్ లో ఆవిష్కరించారు. 1.5 లీటర్ కే9కే డీజిల్ యూనిట్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, గరిష్ట అవుట్ పుట్ శక్తి 84 బీహెచ్ పీ.. సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, గరిష్ట అవుట్ పుట్ శక్తి 108 బీహెచ్ పీని ఈ కారు కలిగి ఉంది. ఆటో పోర్టల్ డేటా ప్రకారం... లాడ్జీ ఎంపీవీ ఆవిష్కరణ నుంచి రెనాల్ట్ ఇండియా అమ్మకాలు కేవలం1252 యూనిట్లు మాత్రమే. 2016 మే లో 730 యూనిట్లు అమ్ముడుపోయాయి.