
న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న ఎర్నింగ్స్ సీజన్, ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, రాజకీయ పరిణామాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్ దిశానిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ విశ్లేషించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. విదేశీ నిధుల ప్రవాహం, డెరివేటీవ్ కాంట్రాక్టుల ముగింపు అంశాలపై ఇన్వెస్టర్లు ప్రత్యేక దృష్టిసారించారు. మార్కెట్ పరంగా చూస్తే కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పెద్ద విషయమే కాదన్నారు.
ఈ అంశం మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపలేదన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు మాత్రమే ప్రస్తుతం ప్రభావం చూపనున్న రాజకీయ అంశాలుగా ఉన్నాయన్నారు. ‘ ఈ వారంలో ఫలితాలు ప్రకటించనున్న కంపెనీల జాబితా ఎక్కువగా ఉండగా, క్యూ1 ఫలితాల్లో ఏమాత్రం పునరుద్ధరణ కనబర్చినా.. వాల్యూయేషన్స్‌లో రీ–రేటింగ్ చోటుచేసుకుంటుంది.’ అని జియోజిత్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఏషియన్ పెయింట్స్, బీహెచ్‌ఈఎల్, కెనరా బ్యాంక్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్టమ్స్, హీరో మోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఐటీసీ, మారుతి సుజుకి, టాటా పవర్, యస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్నాయి.
పార్లమెంట్ సెషన్ కొనసాగుతున్నందున...ఆ సమావేశాల్లో తికమక పెట్టే ఎటువంటి అంశం వెల్లడైనా ఒడిదుడుకులకు ఆస్కారం ఉంటుంది. వచ్చే గురువారం జూలై డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ఒడిదుడుకులను పెంచే అవకాశం ఉంది. సంస్కరణల ఎజెండా ఊపందుకుంటే మార్కెట్‌కు ఇది సానుకూలంకానుంది.’ అని సామ్కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) జిమిత్ మోడి అన్నారు. ‘ఈ వారంలో డెరివేటివ్ ముగింపు ఒడిదుడుకులకు ఆజ్యంపోసే అవకాశం ఉంది.’
అనేది ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ విశ్లేషణ. ‘నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,078 వద్ద ఉండగా.. ఈ స్థాయిని అధిగమించినట్లయితే మరింత ర్యాలీ ఉంటుంది. దిగువస్థాయిలో 10,925 వద్ద మద్దతు ఉంది. అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. మార్కెట్ ప్రస్తుతం క్యూ1 ఫలితాల వెల్లడిపైనే దృష్టిసారించిందని వివరించిన డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి.. ప్రత్యేకించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ఫలితాలపై మరింత ఎక్కువగా మార్కెట్ వర్గాలు దృష్టిసారించినట్లు వివరించారు.
అలజడి రేపిన రూపాయి...
డాలరుతో రూపాయి విలువ కదలికల విషయానికి వస్తే.. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో జీవితకాల కనిష్టస్థాయి 69.12 వద్దకు పతనమై ఆ తరువాత కొంత కోలుకుని ముగింపు సమయానికి 68.85 వద్ద స్థిరపడింది. అంతక్రితం రోజు ముగింపు 68.88 నుంచి 3 పైసలు కోలుకుంది. అయితే అంతకుముందు రోజైన గురువారం సైతం 69.05 వద్దకు క్షీణించి జీవితకాల కనిష్టస్థాయిని నమోదుచేసింది.
మార్కెట్‌ను ఆదుకున్న డీఐఐలు
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) సమాచారం మేరకు గడిచిన వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.1,209 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.1,300 కోట్ల విలువైన షేర్లను కొనుగోలుచేశారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) 129.80 మిలియన్ డాలర్లు (రూ.889 కోట్లు) విలువైన పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment