వన్నెవన్నెల పైకప్పు
హైదరాబాద్: ఇంట్లోని అందాన్ని రెట్టింపు చేసేది ఫాల్స్ సీలింగ్. ఇది మన అభిరుచులకు అద్దం పట్టేలా ఉండాలంటే సీలింగ్ డిజైన్‌తో పాటు సరైన వర్ణాల్ని ఎంచుకోవాలి. ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం... గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే .మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం. కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేలా ఉండాలి. డార్క్, బ్రౌన్ వర్ణాలు చక్కగా నప్పుతాయి. ఇది మన మనసులోని భావాలకు ప్రతీకగా నిలుస్తాయి. గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడే పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపించడంతో పాటు విశాలంగా ఉందనే భావన కలుగుతుంది.
సీలింగ్ డిజైన్ ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోండి. తాజాదనం ఉట్టి పడుతున్నట్లు కనబడాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది.