న్యూస్ కార్ప్ చేతికి స్క్రీన్, వీసీ సర్కిల్
వీసీ సర్కిల్ డీల్ విలువ రూ.100 కోట్లు?
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ భారత్‌లో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. తాజాగా ఆయన సారథ్యంలోని న్యూస్ కార్ప్ ఒకే రోజున మరో రెండు కొనుగోళ్లు జరిపింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌కి చెందిన సినీ పత్రిక ‘స్క్రీన్’ను, ఆర్థికాంశాల సమాచారాన్నందించే వీసీసర్కిల్‌ను కొనుగోలు చేసినట్లు సోమవారం వెల్లడించింది. తాజా డీల్‌తో న్యూస్ కార్ప్ భారత విభాగం స్టార్ ఇండియాకు.. స్క్రీన్ బ్రాండ్ ఫ్రాంచైజీ హక్కులు లభిస్తాయి.
కీలకమైన ఉద్యోగులు స్టార్ ఇండియాకు బదిలీ అవుతారు. మరోవైపు, మొజాయిక్ మీడియా వెంచర్స్‌తో ఒప్పందం ప్రకారం వీసీసర్కిల్ నెట్‌వర్క్ కూడా న్యూస్ కార్ప్ చేతికి వస్తుంది. వీసీసర్కిల్‌డాట్‌కామ్, టెక్‌సర్కిల్‌డాట్‌ఇన్, వీసీసీఎడ్జ్, వీసీసర్కిల్ ట్రెయినింగ్ మొదలైనవి వీసీసర్కిల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయి. భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ పెట్టుబడులు ఉన్నాయని న్యూస్ కార్ప్ సీఈవో రాబర్ట్ థామ్సన్ చెప్పారు. న్యూస్ కార్ప్ ఇటీవలే ప్రాప్‌టైగర్, బిగ్‌డెసిషన్స్‌డాట్‌కామ్ వంటివి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మరింత పట్టు సాధించేందుకు స్క్రీన్ కొనుగోలు ఉపయోగపడగలదని స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ తెలిపారు.
ఆన్‌లైన్‌లో కంటెంట్‌పరంగా ఇది తమ డిజిటల్ ప్లాట్‌ఫాం ‘హాట్‌స్టార్’కి కూడా మరింతగా తోడ్పడగలదని ఆయన వివరించారు. స్క్రీన్ బ్రాండ్‌ను స్టార్ ఇండియా మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ సీఎండీ వివేక్ గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, స్క్రీన్ ప్రింట్ ఎడిషన్ ముద్రణను స్టార్ ఇండియా ఇకపై కొనసాగించకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 1951లో ప్రారంభమైన స్క్రీన్.. సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి సంబంధించిన పత్రికను ముద్రిస్తోంది.అలాగే స్క్రీన్ పేరిట అవార్డుల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు, స్టార్ ఇండియాకు 7 భాషల్లో దాదాపు 40 ఛానళ్లు నిర్వహిస్తోంది. వీటికి సుమారు 70 కోట్ల వీక్షకులు ఉన్నారని అంచనా.
వీసీ సర్కిల్ డీల్..: వీసీ సర్కిల్ నెట్‌వర్క్ కొనుగోలు కోసం న్యూస్‌కార్ప్ రూ. 100 కోట్ల మేర వెచ్చిస్తున్నట్లు సమాచారం. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న వీసీసర్కిల్ నెట్‌వర్క్‌లో దాదాపు 100 మంది ఉద్యోగులు ఉన్నారు.