సహారా చీఫ్ కు నాలుగు వారాల పెరోల్
తల్లి అంత్యక్రియల్లో పాల్గొనే వెసులుబాటు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ తల్లి ఛహాబీ రాయ్ (95) శుక్రవారం ఉదయం లక్నోలో మృతిచెందారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ... సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు నాలుగువారాల పెరోల్ మంజూరు చేసింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్ సంస్థలు రెండు రూ.25,000 కోట్లు వసూలు చేయడం... వడ్డీతో సహా ఈ మొత్తం రూ.35,000 కోట్లు దాటిన వైనం, తిరిగి చెల్లించడంలో వైఫల్యం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు.
ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమల్లో సహారా విఫలమవుతోంది. ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకోవడంలో వైఫల్యం అవుతుండడంతో ఇటీవలే ఈ బాధ్యతలనూ సుప్రీంకోర్టు సెబీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో తల్లి తుదిశ్వాస విడవడంతో, ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుకల్పిస్తూ... రాయ్‌కి పెరోల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రాయ్ న్యాయవాది కపిల్ సిబల్ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే శిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను ఆమోదించింది. రాయ్‌తోపాటు జైలులో ఉన్న సహారా డెరైక్టర్ అశోక్ రాయ్ చౌదరికి కూడా సుప్రీం పెరోల్ మంజూరు చేసింది. కాగా ఈ నాలుగువారాలూ రాయ్ పోలీస్ ప్రొటెక్టివ్ కస్డడీలో ఉంటారని పెరోల్ మంజూరు సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. అంతక్రితం పారిపోవడానికి తన క్లెయింట్ ప్రయత్నం చేయడంటూ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు.