ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ గా అరుంధతీ భట్టాచార్య పదవిని మరికొంతకాలం పొడిగించనున్నట్టు తెలుస్తోంది.
కోల్ కత్తా : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ గా అరుంధతీ భట్టాచార్య పదవిని మరికొంతకాలం పొడిగించనున్నట్టు తెలుస్తోంది. బ్యాంకు బోర్డు బ్యూరో, కేంద్రప్రభుత్వం ఆమె పదవి కొనసాగింపుపై సముఖంగా ఉన్నట్టు సమాచారం. భట్టాచార్య మూడేళ్ల పదవి కాలం ఈ సెప్టెంబర్ తో ముగుస్తోంది. ప్రస్తుతం బ్యాంకు కీలకమైన దశలో నడుస్తుందని, తన అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసుకోవాలనే ప్రతిపాదనతో ఎస్ బీఐ ముందుకు వెళ్తుందని, ఈ దశలో ఎస్ బీఐ చైర్మన్ ను మార్చారని అధికార ప్రతినిధులంటున్నారు. మరో కొన్ని నెలలపాటు ఆమెనే చైర్మన్ గా కొనసాగిస్తారని పేర్కొంటున్నారు.
మరో రెండు నెలల అనంతరం బ్యాంకు పరిస్థితిని బట్టి దీనిపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు. అయితే బయటి వ్యక్తులు ఎవరిని బ్యాంకుకు అధినేతగా నియమించరని అధికార ప్రతినిధులంటున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పటికే మొదటివిడత సంప్రదింపులు జరిగాయని, భట్టాచార్య కొనసాగింపును ఉద్యోగులు స్వాగతిస్తున్నారని, కానీ ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ఎస్ బీఐ చైర్మన్ గా భట్టాచార్య చాలా డైనమిక్ గా ఫర్ ఫార్మెన్స్ చేస్తున్నారని, కీలక సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి బ్యాంకుకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకునేవారని ఓ అధికార ప్రతినిధి చెప్పారు. ఎంతో బాధ్యతాయుతంగా ఆమె పదవిని కొనసాగిస్తున్నారని తెలిపారు. గత మూడేళ్లుగా భట్టాచార్య ఎస్ బీఐ కు చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. మొదటి మహిళా చీఫ్ గా భట్టాచార్య ఎస్ బీఐకు ఎంపికయ్యారు.