పరిమితులు తొలగించినా.. తగ్గిన విత్‌డ్రాయల్స్!
⇒ వారానికి రూ. 53 వేల కోట్ల నుంచి రూ. 32 వేల కోట్లకు డౌన్
⇒ ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా ఎగిసిన నగదు విత్‌డ్రాయల్స్.. ఆ తర్వాత ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ గణనీయంగా తగ్గాయి. జనవరి 13తో ముగిసిన వారాంతంలో విత్‌డ్రాయల్స్ పరిమాణం ఏకంగా రూ. 52,800 కోట్లకు పెరగ్గా .. మార్చి 17–24 మధ్య కాలంలో రూ. 32,500 కోట్లకే పరిమితమైంది. ఎస్‌బీఐ రీసెర్చ్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అయితే, విత్‌డ్రాయల్స్ ఇలా తగ్గడానికి ప్రత్యేక కారణాలేమీ పేర్కొనలేదు. కానీ ఒకవేళ ఇదే ధోరణి కొనసాగిన పక్షంలో బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీకి కొరత ఉండబోదని తెలిపింది. డీమోనిటైజేషన్‌తో ఎకానమీలోకి శాశ్వత ప్రాతిపదికన ఏకంగా రూ. 1.7 లక్షల కోట్లు వచ్చి చేరినట్లు ఎస్‌బీఐ చీఫ్ ఎకానమిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ వివరించారు.
జనవరి 17 దాకా రోజుకు ఏటీఎంల నుంచి ఒక కార్డుపై రోజుకు రూ. 4,500, వారానికి రూ. 24,000 విత్‌డ్రాయల్ పరిమితి కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిమితి రోజుకు రూ. 10,000కు పెరిగింది. చివరికి మార్చి 13న విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేశారు. అప్పట్నుంచీ విత్‌డ్రాయల్ ధోరణులు కాస్త హెచ్చుతగ్గులుగానే ఉంటోందని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది. మరోవైపు, బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు పెరగడమనేది.. ఆర్‌బీఐ లిక్విడిటీ నిర్వహణ తీరుతెన్నులను ప్రభావితం చేయొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ మరో నివేదికలో తెలిపింది.