ఎస్‌బీఐ నుంచి 11 వేల కోట్ల క్విప్ ఇష్యూ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అర్హమైన సంస్థాగత ఇన్వెస్టర్లకు (క్విప్)ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన షేర్లను విక్రయించేందుకు ఇష్యూ ప్రారంభించింది. షేరుకు రూ. 287.58 ఫ్లోర్ ధరతో క్విప్ ఇష్యూను ఓపెన్ చేసినట్లు సోమవారం బీఎస్‌ఈకి తెలిపింది. సెబీ ప్రైసింగ్ ఫార్ముల్లా ప్రకారం ఇష్యూ ధరను నిర్ణయించామని, ఫ్లోర్ ధరతో పోలిస్తే 5 శాతంకంటే అధిక డిస్కౌంట్‌ను ఆఫర్ చేయబోమని బ్యాంకు వివరించింది.
క్విప్ ఇష్యూ జారీ ధరను ఆమోదించేందుకు జూన్ 8న ఎస్‌బీఐ బోర్డు సమావేశమవుతుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లు సమీకరించేందుకు ఎస్‌బీఐ సెంట్రల్ బోర్డు మార్చి నెలలో ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ లేదా రైట్స్ ఇష్యూ లేదా క్విప్, ఏడీఆర్/జీడీఆర్‌ల జారీద్వారా నిధులు సమీకరించడానికి బ్యాంకును బోర్డు అనుమతించింది. ఈ ప్రణాళికలో భాగంగానే తాజా క్విప్ ఇష్యూను జారీచేస్తున్నది.