
ఒకటి రెండు నెలల్లో నగదు కొరత తీరదు..
• 18 నెలల్లో ఎస్‌బీఐ లైఫ్ ఐపీఓ
• ఐపీఓకు ముందువాటా విక్రయ యోచన లేదు
• ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి రాయ్
ముంబై: ఎస్‌బీఐ జీవిత బీమా విభాగం, ఎస్‌బీఐ లైఫ్ ఏడాది–ఏడాదిన్నర కాలంలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. ఎస్‌బీఐ లైఫ్ ఐపీఓకు వచ్చిన తర్వాత కూడా తమ వాటా 50.1 శాతంగా ఉండాలనేకోరుకుంటున్నామని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. అందుకే ఐపీఓకు ముందు ఎస్‌బీఐ లైఫ్‌లో వాటా విక్రయ యోచనేదీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక్కడ ఎస్‌బీఐ లైఫ్‌కు చెందిన సెంట్రల్‌ప్రాసెసింగ్ సెంటర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు.
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు కొరత ఈ నెల 30 కల్లా పరిష్కారమవుతుందా అన్న ప్రశ్నకు ఆమె సానుకూల సమాధానం ఇవ్వలేదు. నగదు సరఫరా ఒకటి రెండు రోజుల్లో సాధారణ స్థితికి రావడంజరగదని పేర్కొన్నారు. కనీసం ఒకటి–రెండు నెలల్లో కూడా సాధారణ స్థితికి వచ్చే పరిస్థితులు లేవన్నారు. క్రమక్రమంగా నగదు సరఫరా సాధారణ స్థితికి వస్తుందని వివరించారు. వచ్చే ఏడాది మార్చికల్లా అనుబంధబ్యాంక్‌ల విలీనం పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.
ఐపీఓ ద్వారా 10 శాతం వాటా విక్రయం..
ఎస్‌బీఐ లైఫ్ ఐపీఓ ద్వారా 10% వాటా విక్రయించాలనుకుంటున్నామని, ఫ్రాన్స్ భాగస్వామి కూడా ఇదే రేంజ్‌లో వాటా విక్రయించే అవకాశాలున్నాయని ఆరుంధతి భట్టాచార్య వివరించారు. ఎస్‌బీఐ లైఫ్‌లో ఎస్‌బీఐకుప్రస్తుతం 74%, ఫ్రాన్స్‌కు చెందిన బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌కు 26% వాటా ఉంది.
మూడో అతి పెద్ద సంస్థ....
ఎస్‌బీఐ లైఫ్‌లో 5 శాతం వాటా విక్రయానికి ఎస్‌బీఐ బోర్డ్ ఆమోదం తెలిపినప్పటికీ, ఎస్‌బీఐ 3.9 శాతం వాటాను ఇటీవలనే విక్రయించింది. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్, సింగపూర్ సావరిన్ ఫండ్‌టిమసెక్ హోల్డింగ్స్ లు చెరో 1.95 శాతం చొప్పున కొనుగోలు చేశాయి. ఈ వాటాల విక్రయ విలువ రూ.1,794 కోట్లుగా ఉంది. ఈ విలువ పరంగా చూస్తే ఎస్‌బీఐ లైఫ్ విలువ రూ.46,000 కోట్లుగా ఉంటుంది. దేశంలో మూడోఅతి పెద్ద ప్రైవేట్ జీవిత బీమా కంపెనీ అవుతుంది. మొదటి రెండు స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ–మ్యాక్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లు ఉన్నాయి.