పీ-నోట్ల నిబంధనలు మరింత కఠినం
ముంబై: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి పీ-నోట్ల నిబంధనలను కఠినతరం చేసింది. పార్టిసిపేటరీ నోట్ల ద్వారా ప్రయోజనం పొందేవాళ్లు మనీల్యాండరింగ్‌ను నిరోధించే భారత చట్టాలకు బద్దులై ఉండడం తప్పనిసరని పేర్కొంది. ఆష్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఓడీఐ-వీటినే పీ-నోట్లగా వ్యవహరిస్తారు)కు సంబంధించి ఏవైనా సందేహాస్పద లావాదేవీలు ఉంటే, వీటిని జారీ చేసిన సంస్థలు తక్షణం తమకు నివేదించాలని సెబి ఆదేశాలు జారీ చేసింది.
నల్లధనం నిరోధం కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సూచనలు ఆధారంగా ఈ నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. పీనోట్ల జారీ, బదిలీ సంబంధిత నియమనిబంధనలనుమరింత పటిష్టం చేసింది. పీ-నోట్లు జారీ చేసిన సంస్థలు వీటిపై కాలానుగుణమైన సమీక్ష నిర్వహించాలని, వీటి బదిలీ వివరాల నెలవారీ నివేదికలను సమర్పించాలని సెబి ఆదేశించింది. భారత్‌లో నేరుగా నమోదు కాకుండా భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే విదేశీ ఇన్వెస్టర్లకు నమోదిత విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు జారీ చేసే ఇన్‌స్ట్రుమెంట్లను పీ-నోట్లుగావ్యవహరిస్తారు.
రెండు ఇన్విట్స్‌కు సెబీ ఆమోదం: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్(ఇన్‌విట్స్) ఏర్పాటు చేయాలన్న రెండు సంస్థల ప్రతిపాదనలకు సెబి ఆమోదం తెలిపింది. ఇన్‌విట్స్ ఏర్పాటు కోసం 4 దరఖాస్తులు వచ్చాయని, వీటిల్లో రెండిండికి ఆమోదం తెలిపామని సెబి చైర్మన్ యు.కె.సిన్హా చెప్పారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(ఆర్‌ఈఐటీఎస్-రీట్స్), ఇన్విట్స్‌పై ఏషియా పసిఫిక్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీట్స్ కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని వివరించారు.