
పీ నోట్స్ ద్వారా స్పెక్యులేషన్‌పై నిషేధం!
నల్లధన ప్రవాహానికి, స్పెక్యులేషన్‌కు పీ–నోట్స్ వాహకంగా ఉపయోగపడకుండా సెబీ కీలక ప్రతిపాదన చేసింది.
► పీ నోట్ ఇష్యూపై 1,000 డాలర్ల ఫీజు
► మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: నల్లధన ప్రవాహానికి, స్పెక్యులేషన్‌కు పీ–నోట్స్ వాహకంగా ఉపయోగపడకుండా సెబీ కీలక ప్రతిపాదన చేసింది.విదేశీ ఇన్వెస్టర్లు జారీ చేసే పీ నోట్‌పై 1,000 డాలర్ల ఫీజుగా విధించాలని పేర్కొంది. అలాగే, ఈ విధమైన డెరివేటివ్ ఇనుస్ట్రుమెంట్‌ను స్పెక్యులేషన్‌కు ఉపయోగించుకోకుండా నిషేధం విధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు సంప్రదింపులు, ప్రజల సూచనలు కోరుతూ సంబంధిత పత్రాలను సెబీ సోమవారం విడుదల చేసింది.
పార్టిసిపేటరీ నోట్స్ లేదా ఆఫ్‌షోర్ డేరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఓడీఐ) ద్వారా వచ్చే విదేశీ పెట్టుబడులు నాలుగు నెలల కనిష్ట స్థాయి రూ.1.68 లక్షల కోట్లకు చేరిన సమయంలో సెబీ ఈ ప్రతిపాదనలు చేయడం గమనార్హం. ఒకప్పుడు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పీ నోట్స్ ద్వారానే సగానికిపైగా వచ్చేవి. ఇప్పుడు అవి 6 శాతానికి తగ్గిపోయాయి. అయితే, ఇప్పటికీ విదేశాల నుంచి నల్లధన ప్రవాహానికి పీ నోట్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓడీఐ మార్గాన్ని దుర్వినియోగం చేయకుండా ఎప్పటికప్పుడు నియంత్రణపరమైన చర్యలు చేపడుతున్నట్టు సెబీ స్పష్టం చేసింది.
2017 ఏప్రిల్ నుంచి మూడేళ్లకు ఒకసారి ప్రతీ ఓడీఐపై 1,000 డాలర్లను నియంత్రణపరమైన ఫీజు కింద వసూలు చేయాలని ప్రతిపాదించినట్టు సెబీ వివరించింది. ఓడీఐలను జారీ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కోసం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ‘‘కొంత మంది ఇన్వెస్టర్లు ఒకటి కంటే ఎక్కువ ఓడీఐల ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రతిపాదిత ఫీజు వారిని నిరుత్సాహపరచడంతోపాటు ఓడీఐకి బదులు నేరుగా ఎఫ్‌పీఐగా నమోదు చేసుకుని ఇన్వెస్ట్ చేసేందుకు ప్రోత్సాహం కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం’’ అని సెబీ వెల్లడించింది. పీ నోట్స్ విదేశీ పోర్ట్ ఫోలియో (ఎఫ్‌పీఐ) ఇన్వెస్టర్లు జారీ చేసేవి. భారత స్టాక్ మార్కెట్లో నమోదు చేసుకోకుండా నేరుగా ఇన్వెస్ట్ చేయదలుచుకున్న విదేశీ ఇన్వెస్టర్లకు ఎఫ్‌పీఐలు వీటిని జారీ చేస్తుంటారు.