కొత్త ఇల్లు కొందామా? రీసేల్‌ చూద్దామా? | selection of property | Sakshi
Sakshi News home page

కొత్త ఇల్లు కొందామా? రీసేల్‌ చూద్దామా?

Published Sat, Jul 7 2018 2:50 AM | Last Updated on Wed, Oct 17 2018 4:13 PM

selection of property - Sakshi

సొంతిల్లు.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధాన లక్ష్యం. గృహ కొనుగోలు నిర్ణయం అంత తేలికైందేమీ కాదు. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుని అవసరాల వరకూ ప్రతి ఒక్కటీ ప్రధానమైందే. సమాజంలో గుర్తింపు కోసం కొందరు ఇల్లు కొంటే.. మరికొందరేమో పెట్టుబడి కోసం, ట్యాక్స్‌ నుంచి మినహాయింపుల కోసం కొంటుంటారు. కారణాలేవైనా ఇల్లు కొనడమనేది ఓ నిరంతర ప్రక్రియ. మరి, ఈ ప్రక్రియలో ఎలాంటి ఇల్లు కొంటే సొంతింటి యోగం మరింత తేలికవుతుంది? అంటే కొత్త ఇల్లు కొనడమా? లేక సెకండ్‌ హ్యాండ్‌ ఇల్లు బెటరా? అని!


సాక్షి, హైదరాబాద్‌:  దేశంలో కొత్త గృహాలకు డిమాండ్‌ ఎంత ఉందో రీసేల్‌ లేక సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్‌ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్‌ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్‌. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా ప్రాపర్టీ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ప్రధాన నగరంలో సెకండ్సే బెటర్‌..
ఉండేందుకు ఇల్లు కొనుగోలు చేసినవారెవరైనా సరే ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గానీ ఉద్యోగ రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గానీ ఆర్ధిక అవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకుంటారు. విద్యా, వైద్యం, వినోదం ఇతరత్రా అవసరాలకు రోజూ ప్రధాన నగరంతో అనుబంధం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొత్త గృహాలు దొరకడం కొంత కష్టం.

ఒకవేళ దొరికినా ధర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఇల్లును కొనుగోలు చేయడం బెటర్‌. అవసరమైతే దాన్ని కూల్చేసి మన అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్టుగా మళ్లీ కొత్త గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇది కొంత డబ్బు, సమయంతో ముడిపడి ఉన్న అంశం. అందుకే ప్రధాన నగరంలో, అభివృద్ధి చెందిన ప్రాంతంలో రీసెల్‌ ప్రాపర్టీలను ఎంచుకోవటమే ఉత్తమమనేది నిపుణుల సూచన.

నిర్వహణ భారం అనుకుంటే కొత్తవే ఉత్తమం..
కొత్త గృహాలతో పోలిస్తే రీసేల్‌ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకే లభ్యమవుతాయి. కానీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ప్రాపర్టీ బదిలీ రుసుము, వినియోగ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెకండ్‌ హ్యాండ్‌ హోమ్స్‌ నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది. పైగా మన అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని రిపేర్‌ చేయించాల్సి ఉంటుంది. ఆయా ఖర్చులన్నింటిని కలిపి చూస్తే మాత్రం రీసేల్‌ ప్రాపర్టీ కంటే అభివృద్ధి చెందే ప్రాంతంలో, శివారు ప్రాంతంలోని కొత్త గృహాల ధరలే తక్కువగా ఉంటాయి.

పర్యావరణ స్పృహ, ఇంధన నిర్వహణ సామర్థ్యాలు, కరెంట్‌ బిల్లుల మీద అవగాహన ఉంటే మాత్రం కొత్త ఇల్లు కొనడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త గృహాలు ఎనర్జీ ఎఫీషియన్సీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇంట్లోనే ఉపకరణాలతో పాటూ గోడలు, పైకప్పులు, కిటికీలు, తలుపులు కూడా ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో విద్యుత్‌ బిల్లు తక్కువగా రావటంతో పాటూ నిర్వహణ వ్యయం కూడా తక్కువ అవుతుంది.

రీసేల్‌ ప్రాపర్టీలను కూడా ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చవచ్చు. కానీ, ఆయా పాత గృహాలు దశాబ్ధాల క్రితంనాటి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మితమైనవి. వాటిని ఇప్పటి ప్రమాణాలను అనుగుణంగా మార్చాలంటే ఖర్చు ఎక్కువవుతుంది. కొత్త ఇళ్లలో గాలి, వెలుతురు బాగా వస్తాయి. దీంతో నివాసితులు ఆరోగ్యంగా ఉంటారు.

రీసేల్‌ కొనేముందు..
రీసేల్‌ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పాత యజమాని నేపథ్యం, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, టైటిల్, అనుమతి పత్రాలు, గృహ రుణానికి సంబంధించిన పత్రాలు వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం అవగాహన లేకపోయినా లేక తప్పిందం జరిగినా సరే మొదటికే మోసం వస్తుంది. అదే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ప్రక్రియంతా డెవలపరే పూర్తి చేసేస్తాడు.

పాత ఇళ్లల్లో ఎలక్ట్రిక్‌ వైర్లు, ఉపకరణాలు, బాత్‌రూమ్‌ ఫిట్టింగ్స్‌ వంటి వాటిల్లో సమస్య వస్తుంటుంది. అదే కొత్త గృహాల్లో బ్రాండెండ్, నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పైగా పాత ఇళ్లలో వాస్తు మార్పులు, గదుల్లో చిన్న చిన్న మార్పులు చేయాలంటే ఇబ్బందులుంటాయి. అదే కొత్త గృహాల్లో నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే
డెవలపర్‌కు మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణంలో  మార్పులు చేసుకునే వీలుంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement