
ద లాల్ సిగ్నల్
నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటితమయ్యాక తొలిసారి స్టాక్ మార్కెట్లు కంగుతిన్నాయ్. లోక్‌సభలో సదానంద గౌడ ప్రకటించిన రైల్వే బడ్జెట్ నిరాశను మిగల్చడంతో ఇన్వెస్టర్లలో ఉన్నట్టుండి భయాలు వ్యాపించాయ్. మొట్టమొదటిసారిగా ఒక బీజేపీ మంత్రి ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఇన్వెస్టర్లు ప్రసంగం మొదట్లోనే నిరుత్సాహానికి లోనయ్యారు.
దేశీయ రైల్వే వ్యవస్థ ఎదుర్కొంటున్న నిధులలేమిని నొక్కిచెప్పిన మంత్రి ప్రసంగం చివర్లో ఇందుకు పలు మార్గాలను ప్రకటించినప్పటికీ మార్కెట్లకు రుచించలేదు. ప్రధానంగా ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లనూ ప్రతిపాదించకపోగా, ఇప్పటికే పలు సమస్యలతో కుదేలైన ప్రాజెక్ట్‌లను ఎలా పూర్తిచేసేదీ స్పష్టం చేయకపోవడం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మరోవైపు మార్కెట్‌ను ఉత్సాహపర్చే పెద్ద ప్రకటనలూ లేకపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి వార్షిక సాధారణ బడ్జెట్ సైతం ఇదే రీతిలో ఉండొచ్చునన్న ఆందోళనలు పెరిగాయి. దీంతో అన్నివైపుల నుంచీ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ ఒక దశలో 610 పాయింట్లు దిగజారింది. నిజానికి తొలుత 90 పాయింట్ల వరకూ లాభపడి కొత్త గరిష్టం 26,190ను తాకింది.
అయితే రైల్వే బడ్జెట్ వెలువడ్డాక పతనబాట పట్టి 25,495 వద్ద కనిష్టాన్ని చేరింది. చివరికి 518 పాయింట్లు కోల్పోయి 25,582 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం ఇదే బాటలో 7,809 వద్ద కొత్త రికార్డును అందుకున్నప్పటికీ ఇంట్రాడేలో ఆ స్థాయి నుంచి 7,596కు పడిపోయింది. ట్రేడింగ్ ముగిసేసరికి నికరంగా 164 పాయింట్లు పోగొట్టుకుని 7,623 వద్ద నిలిచింది. ఇంతక్రితం మార్కెట్లు 2013 సెప్టెంబర్ 3న మాత్రమే ఈ స్థాయిలో పతనమయ్యాయి. అప్పట్లో సెన్సెక్స్ 651, నిఫ్టీ 299 పాయింట్లు చొప్పున దిగజారాయి.
బ్లూచిప్స్ బోర్లా
సెన్సెక్స్, నిఫ్టీలో భాగమైన సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే అదికూడా నామమాత్రంగా లాభపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక దిగ్గజాలు భెల్, ఎన్‌టీపీసీ, టాటా పవర్, కోల్ ఇండియా, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, సెసాస్టెరిలైట్, ఆర్‌ఐఎల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్ ఇలా 8-2% మధ్య పతనమయ్యాయి.
రియల్టీ నేలచూపులు
రియల్టీ షేర్లు కోల్టేపాటిల్, యూనిటెక్, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఐఎల్, ఫీనిక్స్ మిల్, శోభా, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీబీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 13-4.5% మధ్య కుప్పకూలాయి.
విద్యుత్ షాక్
విద్యుత్ రంగ షేర్లు అదానీ పవర్, పీటీసీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేపీ పవర్, సీఈఎస్‌సీ, ఏబీబీ, సీమెన్స్, రిలయన్స్ పవర్, ఎన్‌హెచ్‌పీసీ 8 శాతం స్థాయిలో నీరసించాయి.
బీఎస్‌ఈ-500 విలవిల
ట్రేడైన షేర్లలో ఏకంగా 2,234 తిరోగమిస్తే, కేవలం 770 లాభపడ్డాయి. బీఎస్‌ఈ-500లో జిందాల్ స్టెయిన్‌లెస్, హెచ్‌ఎంటీ, ఉత్తమ్ గాల్వా, జేపీ అసోసియేట్స్, ఇండియా సిమెంట్స్, గుజరాత్ గ్యాస్, ఐఎఫ్‌సీఐ, ధనలక్ష్మీ బ్యాంక్, మహీంద్రా సీఐఈ, ఎంఎంటీసీ, ఎంటీఎన్‌ఎల్, టీబీజెడ్, సిండికేట్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, ఎస్కార్ట్స్, జైన్ ఇరిగేషన్ 13-8% మధ్య దిగజారాయి.
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు
విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) రూ. 423 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ సంస్థలు రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.