కొనసాగుతున్న సెన్సెక్స్ జోరు!
ముంబై: గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, బ్లూచిప్ కంపెనీ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో కొనసాగుతున్నయి. డెరెవేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలను ఆర్జించాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 212 పాయింట్ల లాభంతో 27310, నిఫ్టీ 65 పాయింట్ల వృద్ధితో 8155 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 23 తేది తర్వాత మళ్లీ నిఫ్టీ 8100 మార్కుపైన ట్రేడ్ అవ్వడం ఇదే తొలిసారి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టెక్ మహీంద్ర, హెచ్ సీఎల్ టెక్ 4 శాతానికి పైగా లాభపడగా, డీఎల్ఎఫ్ 3 శాతం, ఇన్ఫోసిస్, టీసీఎస్ 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. కెయిర్న్ ఇండియా, ఎంఅండ్ఎం, టాటా పవర్, బీహెచ్ఈఎల్, లుపిన్ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.