ముంబై: శుక్రవారం నాటి దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 106పాయింట్ల నష్టంతో 27,836 దగ్గర , నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 8,541 దగ్గర క్లోజయ్యాయి. దీంతో ఈ వారంలో వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ శుక్రవారం విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ ను నష్టాల్లోకి నెట్టాయి. మరోవైపు వారాంతం కావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారని ఎనలిస్టుల అంచనా. ప్రధానంగా ఐటీ రంగం నష్టాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి. మెటల్ , టెలికాం రంగంలో కొనుగోళ్లపై ఆసక్తి నెలకొంది. వెల్ స్పన్ ఇండియా, టాటా స్టీల్ టాప్ గెయినర్స్ గా నిలవగా, ఇన్ఫోసిస్ టాప్ లూజర్ గా నిలిచింది. ఐడియా, భారతి ఎయిర్ టెల్ లాభాలను ఆర్జించాయి.
అంచనాలకు మించని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ ను నిరాశ పర్చాయి. దీంతో ఇన్ఫోసిస్ షేర్లు కుప్పకూలాయి. ఒకదశలో దాదాపు10 శాతం నష్టాలను మూటగట్టుకుంది. దీంతో ఏడునెలల కనిష్టానికి షేరు ధర చేరింది. 2013 తర్వాత ఇంత భారీ పతనం ఇదేనని లెక్కలు చెబుతున్నాయి. దీంతోపాటు మరో ఐటి కంపెనీ టీసీఎస్ ఫలితాలు కూడా మదుపర్లను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో టీసీఎస్ షేర్ కూడా భారీగా నష్టపోయింది.