ముంబై : మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలను మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 154.47 పాయింట్ల లాభంతో 25,807దగ్గర, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 46.45 పాయింట్ల లాభంతో 7,900 మార్కును దాటి 7904 ట్రేడవుతోంది. ఆయిల్, ఆటో, ఇన్ ఫ్రా టెక్నాలజీ, ఎఫ్ఎమ్ సీజీ షేర్లలో కొనసాగుతున్న కొనుగోలు మద్దతుతో స్టాక్ సూచీలు లాభాల్లో నడుస్తున్నాయి. యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ షేర్లలో కొనుగోల ర్యాలీతో ఆ షేర్లు 2శాతం మేర పెరిగాయి. హెచ్ డీఎఫ్ సీ, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ సుజుకీలు మార్కెట్లను లీడ్ చేస్తుండగా.. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్ నష్టాల బాట పట్టాయి.
మరోవైపు ఆయిల్ ధరలు పెరిగాయనే వార్తను వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించిన అనంతరం ఆసియన్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా కొన్ని కంపెనీ షేర్లను లాభాల్లో నడిపిస్తున్నాయి. తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న డీఎమ్ కేకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వరించబోతుందని సన్ టీవీ ప్రకటించిన నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు 9.5శాతం మేర పెరిగాయి. చెన్నైకు చెందిన ఈ సన్ టీవీ, కళానిధి మారన్ కు చెందినది. డీఎమ్ కే ప్రెసిడెంట్ ఎమ్. కరుణానిధికి కళానిధి మనువడు.
మరోవైపు పసిడి, వెండి ధరలు కూడా లాభాల్లో నడుస్తున్నాయి. పసిడి రూ.76 లాభంతో రూ.30,053గా కొనసాగుతుండగా.... వెండి రూ.182 లాభంతో రూ.41,169గా నమోదవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.69గా ఉంది.