మార్కెట్లకు చమురు జోష్
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు క్షీణించడంతో దేశీ మార్కెట్లకు జోష్ వచ్చింది. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 100 డాలర్ల సమీపానికి చేరగా, నెమైక్స్ ధర 93 డాలర్లకు దిగింది. దీంతో ఆయిల్ షేర్లకు డిమాండ్ పుట్టింది. హెచ్‌పీసీఎల్, క్యాస్ట్రాల్, ఐవోసీ, ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా 4.5-2.5% మధ్య జంప్ చేయగా, ఆర్‌ఐఎల్ 1% లాభపడింది. ఫలితంగా ఆయిల్ ఇండెక్స్ 1.8% పుంజుకోగా, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్ రంగాలు సైతం 1.2% చొప్పున లాభపడ్డాయి.
చమురు ధరలు క్షీణించడం ద్వారా దిగ్గుమతుల భారం తగ్గుతుందని, దీంతో ద్రవ్య లోటులకు కళ్లెం పడుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతిమంగా ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో అన్ని రంగాల్లోనూ కొనుగోళ్లు చేపట్టారని చెప్పారు. వెరసి సెన్సెక్స్ 293 పాయింట్లు జంప్‌చేసి 27,320 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 87 పాయింట్లు ఎగసి 8,174 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,355కు చేరగా, నిఫ్టీ 8,180ను అధిగమించింది. ఇవన్నీ కొత్త రికార్డులే.
నాలుగు మాత్రమే...
సెన్సెక్స్ దిగ్గజాలలో 4 మాత్రమే నీరసించాయి. ఎన్‌టీపీసీ 1.6%, ఎంఅండ్‌ఎం 0.7% చొప్పున నష్టపోగా, హిందాల్కో 3.5% ఎగసింది. మరోవైపు ఎఫ్‌ఐఐల అండ కొనసాగుతోంది. మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ. 1.25 లక్షల కోట్లు పెరిగింది. రబ్బర్ ధరలు పతనంకావడంతో టైర్ కంపెనీల షేర్లు అపోలో, సియట్, డన్‌లప్, ఫాల్కన్, గుడ్‌ఇయర్, జేకే, ఎంఆర్‌ఎఫ్, టీవీఎస్ శ్రీచక్ర 5-20% మధ్య దూసుకెళ్లాయి.