నిఫ్టీ 10 నెలల గరిష్టం
♦ సెన్సెక్స్ 8 నెలల గరిష్టం
♦ వారంలో 747 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లో వరుసగా ఐదో రోజు ర్యాలీ కొనసాగింది. శుక్రవారం 41 పాయింట్ల పెరుగుదలతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 నెలల గరిష్టస్థాయి 8,328 వద్ద ముగిసింది. గతేడాది ఆగస్టు 20 తర్వాత 8,300 పాయింట్లపైన నిఫ్టీ ముగియడం ఇదే ప్రధమం. బీఎస్‌ఈ సెన్సెక్స్ 145 పాయింట్లు ఎగిసి 27,145 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌కిది అక్టోబర్ 27 తర్వాత అత్యధిక ముగింపు.ఈ రెండు సూచీలు ఈ ఏడాది మే 27 తర్వాత ఒకేవారంలో ఇంతగా పెరగడం ఇదే ప్రధమం. ఈ వారంలో సెన్సెక్స్ 747 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్లు ర్యాలీ జరిపాయి.
ఉత్పాదక రంగం దన్ను....
దేశంలో ఉత్పాదక రంగం ఊపందుకుందన్న సంకేతాలనిస్తూ జూన్‌లో నికాయ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ సూచీ 51.7 స్థాయికి పెరగడం ఇన్వెస్టర్లలో తాజా ఉత్సాహాన్ని నింపిందని విశ్లేషకులు చెప్పారు. ప్రపంచ మార్కెట్లు కూడా పటిష్టంగా ట్రేడ్‌కావడంతో భారత్ సూచీలు అదేబాటలో గరిష్టస్థాయి వద్ద ముగిసాయని వారు తెలిపారు. క్రితం రాత్రి అమెరికా సూచీలు మరో 1.5 శాతం పెరగడంతో పాటు శుక్రవారం ప్రధాన ఆసియా మార్కెట్లయిన హాంకాంగ్, తైవాన్, కొరియాలు దాదాపు 1 శాతం ఎగిసాయి. బ్రెగ్జిట్ సంక్షోభానికి కేంద్రమైన యూరప్‌లో కూడా మార్కెట్లు స్థిరంగా ముగిసాయి.
ఓఎన్‌జీసీ టాప్...
సెన్సెక్స్-30 షేర్లలో 18 షేర్లు లాభాలతో ముగియగా, అన్నింటికంటే అధికంగా ఓఎన్‌జీసీ 3.72 శాతం పెరిగింది. ఎల్ అండ్ టీ, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, గెయిల్‌లు 2-3 శాతం మధ్య పరుగులు తీసాయి.