సెన్సెక్స్ రికార్డు హై, ఆవిరైన లాభాలు!
హైదరాబాద్: బ్లూ చిప్ కంపెనీ షేర్లను విదేశీ సంస్థాగత మదుపుదారులు కొనుగోళ్లు జరపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం సానుకూలంగా స్పందించాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో జీవిత కాలపు గరిష్ట స్థాయిని సెన్సెక్స్ నమోదు చేసుకుంది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఒడిగట్టడంతో ప్రధాన సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి.
ఓ దశలో సెన్సెక్స్ 22172 పాయింట్ల రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్ చివరికి 40 పాయింట్ల లాభంతో 22095 వద్ద ఆల్ టైమ్ హై వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుకు నిఫ్టీ 11 పాయింట్ల వృద్ధితో 6601 వద్ద క్లోజైంది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసా స్టెరిలైట్ అత్యధికంగా 4.23 శాతం, హిండాల్కో, జిందాల్ స్టీల్, ఐడీఎఫ్ సీ 3 శాతానికి పైగా లాభపడగా, టాటా మోటార్స్ 2.76 శాతం వృద్ధిని సాధించింది.
డాక్టర్ రెడ్డీస్ అత్యధికంగా 3.30 నష్టపోగా, లుపిన్, టీసీఎస్, సన్ ఫార్మా, జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీల షేరు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.