
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రికార్డుల మోత మోగించడం ప్రారంభించాయి. నిఫ్టీ తన 11 వేల మార్కును మరోసారి తాకేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ మార్కును తాకడం ఇదే మొదటిసారి. సెన్సెక్స్ సైతం ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదుచేసింది. 180 పాయింట్లకు పైగా జంప్ చేసిన సెన్సెక్స్ 36,453 వద్ద రికార్డు సృష్టించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా లాభపడుతూ.. 36,532 వద్ద రికార్డు గరిష్టంలో దూసుకుపోతుంది. నిఫ్టీ సైతం 11 వేల మార్కును చేధించి 83 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. అన్ని రంగాల షేర్లు గ్రీన్ గానే ట్రేడవుతున్నాయి. ఎక్కువగా లాభాలు పీఎస్‌యూ బ్యాంక్‌లు, ఎనర్జీ, మెటల్స్ స్టాక్స్‌లో నెలకొంటున్నాయి. అదేవిధంగా మిడ్‌క్యాప్స్ కూడా లాభాల్లోనే నడుస్తున్నాయి.
అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు ముదురుతున్నప్పటికీ, దేశీ స్టాక్ మార్కెట్లు జోరుగానే సాగుతున్నాయని, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లు జోరందుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్, యస్‌బ్యాంక్, ఆర్‌ఐఎల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, మారుతీ 5-1.2 శాతం మధ్య పెరగగా.. ఇన్‌ఫ్రాటెల్ 2.5 శాతం పతనమైంది. దీని బాటలోనే టీసీఎస్, అదానీ పోర్ట్స్ స్వల్పంగా 0.4 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. అటు ఆసియా మార్కెట్లలో కూడా ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. వాణిజ్య వివాద ఆందోళనలు తలెత్తినప్పటికీ ఆసియా మార్కెట్లు జోరందుకోవడం గమనార్హమని విశ్లేషకులంటున్నారు.