కొద్ది రోజులుగా కొత్త రికార్డులు సృష్టిస్తూ సాగుతున్న స్టాక్ మార్కెట్లు బుధవారం వెనకడుగు వేశాయి. రోజుమొత్తం బలహీనంగా కదిలి చివరకు స్వల్ప స్థాయిలో ముగిశాయి. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 79 పాయింట్లు నష్టపోయి 24,298 వద్ద ముగియగా, నిఫ్టీ 23 పాయింట్లు క్షీణించి 7,253 వద్ద నిలిచింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 562 పాయింట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. గరిష్ట స్థాయిలవద్ద ఆపరేటర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టడంతో మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు తెలిపారు. కాగా, చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. వెరసి మార్కెట్లు నష్టపోయినప్పటికీ బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో లాభపడ్డాయి.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు
మంగళవారం ఉన్నట్టుండి రూ. 105 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 266 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్స్ సైతం రూ. 439 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఇక బీఎస్‌ఈలో క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు 2-1% మధ్య తిరోగమించగా, రియల్టీ 2% బలపడింది. బ్లూచిప్స్‌లో ఎస్‌బీఐ, యాక్సిస్ 2.5% స్థాయిలో నష్టపోగా, భెల్, ఎల్‌అండ్‌టీ, భారతీ సైతం 2% చొప్పున డీలాపడ్డాయి. అయితే మరోవైపు బజాజ్ ఆటో 5% జంప్‌చేసింది. ఈ బాటలో హిందాల్కో, ఎన్‌టీపీసీ, సెసాస్టెరిలైట్, కోల్ ఇండియా 2.5-1.5% మధ్య పుంజుకున్నాయి.
ఎస్సార్ షేర్ల హవా
మిడ్ క్యాప్స్‌లో ఎస్సార్ పోర్ట్స్, ఎస్సార్ షిప్పింగ్, ఎస్సార్ ఆయిల్ 16% చొప్పున దూసుకెళ్లగా, నవభారత్ వెంచర్స్, హెచ్‌ఎంటీ, ఆప్టో సర్క్యూట్స్ 20% అప్పర్ సీలింగ్‌ను తాకాయి. ఈ బాటలో హెచ్‌సీఎల్ ఇన్ఫో, జిందాల్ స్టెయిన్‌లెస్, జామెట్రిక్, టొరంట్ పవర్, ఐఎఫ్‌సీఐ, ఎంఎంటీసీ, పెనిన్సులార్, ఐనాక్స్, సి.మహీంద్రా, ఎంఆర్‌పీఎల్, గీతాంజలి, ఆర్‌సీఎఫ్, ఎస్‌కేఎస్ 15-10% మధ్య పురోగమించాయి.
4 రోజుల లాభాలకు బ్రేక్
Published Thu, May 22 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement