యెలెన్ వ్యాఖ్యలతో లాభాలు
♦ 25వేల పాయింట్లను దాటిన సెన్సెక్స్
♦ 438 పాయింట్ల ప్లస్... 25,339 వద్ద ముగింపు
♦ 7,700 పాయింట్లను అధిగమించిన నిఫ్టీ
♦ 138 పాయింట్ల లాభపడి 7,735 వద్ద ముగింపు
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జెనెట్ యెలెన్ వ్యాఖ్యలు బుధవారం స్టాక్ మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. ఇటీవల పతనం కారణంగా కుదేలైన బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా ఉండటంతో సెన్సెక్స్ 25వేల పాయింట్లను, నిఫ్టీ 7,700 పాయింట్లను దాటేశాయి. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటంతో షార్ట్ పొజిషన్ల కవరింగ్ కూడా తోడవడంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 438 పాయింట్లు లాభపడి 25,339 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 138 పాయింట్లు లాభపడి 7,735 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు లాభపడడం నెల రోజుల్లో ఇదే తొలిసారి. బ్యాంక్, ఫార్మా, రియల్టీ, లోహ, క్యాపిటల్ గూడ్స్‌లో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇదే జోరును రోజంతా కొనసాగించింది. గత 2 రోజుల్లో సెన్సెక్స్ 437 పాయింట్లు నష్టపోయింది.
లాభాలు కొనసాగుతాయ్ : వడ్డీరేట్ల పెంపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జెనెట్ యెలెన్ వ్యాఖ్యానించారు. దీంతో ఏప్రిల్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాల్లేవన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు దూసుకుపోయాయి. వచ్చే వారం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గిస్తుందన్న అంచనాలు, రూపాయి 17 పైసలు బలపడి మూడు నెలల గరిష్ట స్థాయి, 66.37కు చేరడం, రూ.4,000 కోట్ల బకాయిలు సెప్టెంబర్‌లోగా చెల్లిస్తానని విజయ్ మాల్యా ఆఫర్ చేయడంతో బ్యాంక్ షేర్లు లాభపడడం,, ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు లేనందున విదేశీ నిధులు వెల్లువెత్తుతాయని, కమోడిటీ ధరలు నిలకడగా ఉండడం, చైనా మందగమన భయాలు తొలగిపోవడంతో స్టాక్ మార్కెట్ జోరు కొనసాగుతుందని నిపుణులంటున్నారు.