చివర్లో జోరుగా సాగిన కొనుగోళ్ల కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్ల బలహీనత కారణంగా రోజులో అధిక భాగం మన మార్కెట్ నష్టాల్లోనే ట్రేడైంది. ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించడంతో చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. స్టాక్ సూచీలు లాభపడటం ఇది వరుసగా ఆరో రోజు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,900 పాయింట్లపైకి ఎగబాకింది. 20 పాయింట్ల లాభంతో 10,909 పాయింట్లకు చేరింది. బీఎస్‌ఈ సెన్సెక్స్77 పాయింట్లు పెరిగి 36,347 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,387 పాయింట్లు పెరిగింది. ఫార్మా, లోహ, క్యాపిటల్ గూడ్స్, వాహన రంగ షేర్లు పెరిగాయి. ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు తగ్గాయి.
ప్రపంచ మార్కెట్లు పతనమైనా....
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం మంగళవారం ఆరంభమైంది. రేట్ల పెంపునకు సంబంధించిన కీలక నిర్ణయం నేడు (బుధవారం) వెలువడనున్నది. రేట్ల పెంపు అంచనాలకు తోడు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు కూడా జత కావడంతో సోమవారం అమెరికా స్టాక్ సూచీలు 2 శాతం పతనమయ్యాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా 1–2 శాతం రేంజ్‌లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్లు పతనమైనా మన మార్కెట్ మాత్రం లాభాల్లో ముగియగలిగింది. అమెరికా షేల్‌గ్యాస్ ఉత్పత్తి అంచనాలను మించుతుందన్న వార్తల కారణంగా బ్యారెల్ బ్రెంట్ చమురు 2.7 శాతం క్షీణించి 57.98 డాలర్లకు పడిపోయింది. ముడి చమురు ధరలు తగ్గడం రూపాయికి జోష్‌నిచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 93 పైసలు లాభపడి 70.63ను తాకింది.
నష్టాల్లోంచి...లాభాల్లోకి....
సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. ఆరంభంలో అమ్మకాలు, ఆ తర్వాత కొనుగోళ్లు, జోరుగా సాగాయి. మధ్యాహ్నం వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. ఒక దశలో 224 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 105 పాయింట్లు లాభపడింది. రోజంతా 329 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడినట్లయింది. ఇక నిఫ్టీ ఒక దశలో 69 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 27 పాయింట్లు లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, మన మార్కెట్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. చమురు ధరలు దిగిరావడం, బాండ్ల రాబడులు కూడా తగ్గడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు.
సన్ ఫార్మా షేర్ 2.9% లాభంతో రూ. 433 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ముడి చమురు ధరలు తగ్గడంతో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 2.7 శాతం వరకూ పెరిగాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్ వంటి విమానయాన రంగం షేర్లు 7 శాతం వరకూ ఎగిశాయి. జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ రేటింగ్‌ను బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్ 8 శాతం నష్టంతో రూ.463 వద్ద ముగిసింది. నిఫ్టీలో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రహదారి ఆస్తులను విక్రయించనున్నామని వెల్లడించిన కారణంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు–ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ షేర్లు 10 శాతం వరకూ పెరిగాయి. ఆరు రోజుల్లో రూ.6.80 లక్షల కోట్లుస్టాక్ మార్కెట్లో ఆరు రోజులుగా లాభాల జోరు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఆరు రోజుల్లో రూ.6.80 లక్షల కోట్లు పెరిగి రూ.1,44,72,895కు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment