ఫార్చ్యూన్-500లో మనవి ఏడు!!
♦ మన ఏడింట్లో నాలుగు చమురు కంపెనీలే
♦ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న వాల్‌మార్ట్
♦ రెండు, మూడు స్థానాలు చైనా కంపెనీల సొంతం
♦ ఆదాయాన్ని బట్టి కంపెనీల్ని వర్గీకరించిన ఫార్చ్యూన్
న్యూయార్క్: భారత్‌కు చెందిన ఏడు కంపెనీలు తాజాగా ఫార్చ్యూన్-500 ‘ప్రపంచపు అతిపెద్ద కంపెనీల’ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిల్లో నాలుగు ప్రభుత్వానివైతే.. మిగతావి ప్రైవేట్ రంగానివి. ఆదాయం పరంగా కంపెనీల ఎంపిక జరిగిందని ఫార్చ్యూన్ పేర్కొంది. రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’ 4,82,130 మిలియన్ డాలర్ల ఆదాయంతో జాబితాలో అగ్రస్థానాన్ని సాధిం చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 54.7 బిలియన్ డాలర్ల ఆదాయంతో 161వ స్థానంలో నిలిచింది.
ఇండియన్ ఆయిల్ తర్వాతి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి. ఇక యాపిల్ 9వ స్థానంలో నిలిచింది. గతేడాది జాబితాలో స్థానం పొందిన చమురు-గ్యాస్ దిగ్గజం ఓఎన్‌జీసీ ఈ సారి చోటు కోల్పోయింది. కొత్తగా ఈసారి రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్థానం దక్కించుకుంది. ఫార్చ్యూన్-500 జాబితాలోని కంపెనీలు 6.7 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ.. 33 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటి మొత్తం ఆదాయం గతేడాది 27.6 ట్రిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.