నేడు (14న) దేశీ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.10 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 66 పాయింట్లు క్షీణించి 10,748 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 10,814 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా ఫాంగ్ స్టాక్స్ దెబ్బతీయడంతో సోమవారం నాస్‌డాక్, ఎస్‌అండ్‌పీ 2-1 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. నేడు బ్యాంకింగ్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో డోజోన్స్ యథాతథంగా నిలిచింది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో ప్రతికూల ధోరణి కనిపిస్తోంది. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని భావిస్తున్నారు.
ఆటుపోట్ల మధ్య
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో సోమవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ఓమాదిరి లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 99 పాయింట్లు బలపడి 36,694 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు పుంజుకుని 10,803 వద్ద నిలిచింది. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 425 పాయింట్లు జంప్‌చేసింది. 37,000 పాయింట్ల కీలకమార్క్‌ను అధిగమించింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,741 పాయింట్ల వద్ద, తదుపరి 10,680 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,879 పాయింట్ల వద్ద, ఆపై 10,996 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,828 పాయింట్ల వద్ద, తదుపరి 21,567 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,504 పాయింట్ల వద్ద, తదుపరి 22,918 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
డీఐఐల భారీ అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారంవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 222 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1459 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 1031 కోట్లు, డీఐఐలు రూ. 431 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment