శామ్‌సంగ్ నుంచి డేటా ఆదా చేసే స్మార్ట్‌ఫోన్..
దేశీ మార్కెట్లోకి గెలాక్సీ జే2 ధర రూ. 8,490
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ సిరీస్‌లో జే2 మోడల్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది. డేటాను ఆదా చేసే అల్ట్రా డేటా సేవింగ్ (యూడీఎస్) ఫీచర్‌ను తొలిసారిగా ఇందులో పొందుపరిచింది. ఈ ఫీచర్‌తో 50 శాతం వరకు డేటా ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది. ధర రూ.8,490. కంపెనీ నుంచి చవకైన 4జీ మోడల్ ఇదే.
అలాగే జే2తో కలిపి శామ్‌సంగ్ ఇప్పటి వరకు విడుదల చేసిన 4జీ మోడళ్ల సంఖ్య 17కు చేరుకుంది. భారతీయ మార్కెట్ కోసం దేశీయంగానే దీనిని రూపొందించినట్టు శామ్‌సంగ్ ఐటీ, మొబైల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కస్టమర్ల నుంచి వచ్చే స్పందన ఆధారంగా యూడీఎస్ ఫీచర్‌ను ఇతర మోడళ్లలో జోడిస్తామని చెప్పారు. 2015లో శామ్‌సంగ్ 23 మోడళ్లను మారె ్కట్లోకి తీసుకొచ్చింది.
ఇవీ గెలాక్సీ జే2 ఫీచర్లు..
క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ను గెలాక్సీ జె2 స్మార్ట్‌ఫోన్‌కు జోడించారు. రూ.10 వేలలోపు మోడళ్లలో ఈ తరహా స్క్రీన్‌ను పొందుపర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సిమ్‌తోపాటు వైఫై నుంచి ఏకకాలంలో ఇంటర్నెట్‌ను ఆస్వాదించొచ్చు. తద్వారా డేటా వేగం అధికంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 4.7 అంగుళాల స్క్రీన్, ఆన్‌డ్రాయిడ్ 5.1 ఓఎస్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ ఇతర ఫీచర్లు. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది. 128 జీబీ వరకు మెమరీ ఎక్స్‌పాండ్ చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 నుంచి జే2 అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ బండిల్ ఆఫర్‌లో కస్టమర్లు రెండింతల డేటా ఆరు నెలల వరకు పొందవచ్చు.