
ఎస్‌బీహెచ్ లాభం 375 కోట్లు
క్యూ2లో 21% వృద్ధి
* ఈ ఏడాది వ్యాపారంలో 10 శాతం వృద్ధి అంచనా
* మార్చిలోగా మరోసారి వడ్డీరేట్లు తగ్గొచ్చు
* ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ద్వితీయ త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 21 శాతం, ఆదాయంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది.
గతేడాది ఇదే కాలానికి రూ. 311 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ. 375 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 3,675 కోట్ల నుంచి రూ. 3,945 కోట్లకు చేరింది. ట్రెజరీ విభాగంలో లాభాలు, ఇతర ఆదాయాలు పెరగడం, వ్యయాలు తగ్గించుకోవడం నికర లాభం పెరగడానికి ప్రధాన కారణాలుగా ఎస్‌బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ పేర్కొన్నారు. బుధవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమీక్షా కాలంలో కాస్ట్ టు ఇన్‌కమ్ (ఆదాయంలో వ్యయం చేసే శాతం ) 3.28 శాతం తగ్గి 47.78 శాతం నుంచి 44.50 శాతానికి చేరిందన్నారు.
మొత్తం వ్యాపారం 8 శాతం వృద్ధితో రూ. 2.36 లక్షల కోట్లు దాటింది. కార్పొరేట్ రుణాలకు ఇంకా డిమాండ్ పెరగకపోవడంతో ఈ ఏడాది మొత్తం మీద వ్యాపారంలో 10 శాతానికి అటుఇటుగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సమీక్షా కాలంలో ఇతర ఆదాయం 47 శాతం పెరిగి రూ. 224 కోట్ల నుంచి రూ. 329 కోట్లకు చేరింది. తొలి త్రైమాసికంతో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు స్వల్పంగా పెరిగినా గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గాయన్నారు.
గతేడాది సెప్టెంబర్ నాటికి 5.73 శాతంగా ఉన్న స్థూల ఎన్‌పీఏ తొలి త్రైమాసికానికి 4.59 శాతానికి తగ్గినా, ద్వితీయ త్రైమాసికానికి స్వల్పంగా 4.92 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో నికర నిరర్థక ఆస్తులు 2.87 శాతం నుంచి 2.39 శాతానికి తగ్గాయి. తొలి త్రైమాసికంతో పోలిస్తే నికర వడ్డీ లాభదాయకత (నిమ్) 3.08 శాతం నుంచి 3.05 శాతానికి తగ్గింది.
వడ్డీరేట్లు తగ్గొచ్చు..
వచ్చే మార్చిలోగా ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలున్నాయని ముఖర్జీ పేర్కొన్నారు. వడ్డీరేట్ల తగ్గింపుపై ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు వంటి నిర్ణయాలు ప్రభావం చూపుతాయని, వీటిపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ ఏడాదిలోగా ఒకసారి వడ్డీరేట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరిగితే టైర్-2 బాండ్ల ద్వారా నిధులు సేకరించే అంశాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.