
ఎస్‌బీఐ ‘హోమ్ లోన్ ఆన్ వీల్స్’
చెన్నై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ‘హోమ్ లోన్ ఆన్ వీల్స్’ అనే పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య శనివారం చెన్నైలో రెండు ‘హోమ్ లోన్ ఆన్ వీల్స్’ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. ఎస్‌బీఐ చైర్‌పర్సన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె చెన్నై రావడం ఇదే ప్రథమం. బ్యాంక్ గృహ రుణాల గురించి వివరించడం ఈ కార్యక్రమం ధ్యేయం.
హోమ్ లోన్‌కు సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ తక్షణ అనుమతి పత్రాలను ఈ వ్యాన్లలో ఇస్తారని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను ఈ వ్యాన్లలో ప్రారంభించవచ్చని వివరించింది. వ్యాన్ల ప్రారంభోత్సవంలో ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ ఎం.జి.వైద్యన్, చీఫ్ జనరల్ మేనేజర్ (చెన్నై సర్కిల్) పి.ఎస్.ప్రకాశ్ రావు కూడా పాల్గొన్నారు.
ఎస్‌బీఐలో ప్రభుత్వ వాటా తగ్గింపుపై ముసాయిదా నోట్
కాగా ఎస్‌బీఐలో ప్రభుత్వ వాటా తగ్గింపునకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే నెలలో మంత్రివర్గ ముసాయిదా నోట్‌ను రూపొందించే అవకాశం ఉందని ఆర్థిక సేవల కార్యదర్శి జి.ఎస్.సంధు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. ఎస్‌బీఐలో ప్రభుత్వానికి 58.60 శాతం వాటా ఉంది.